గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకం అభాసుపాలవుతోంది. జిల్లాలోని కూలీలకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఓ వైపు వర్షాలు పడక వ్యవసాయ పనులు లేక, చేసిన ఉపాధిహామీ వేతనాలు రాక కూలీలు ఆందోళన చెందుతున్నారు.
-
మూడు నెలలుగా ఎదురుచూపులు
-
రూ.10కోట్ల వరకు వేతన బకాయిలు
-
ఆందోళనలో కూలీలు
జగిత్యాల రూరల్ : గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకం అభాసుపాలవుతోంది. జిల్లాలోని కూలీలకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఓ వైపు వర్షాలు పడక వ్యవసాయ పనులు లేక, చేసిన ఉపాధిహామీ వేతనాలు రాక కూలీలు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలోని 1212 గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద 6,62,579 కుటుంబాలకు జాబ్‌కార్డు ఉన్నాయి. వీరిలో 7,99,013 మంది పనిచేస్తున్నారు. వీరికి సంవత్సరం జిల్లాలో 1,56,701 పనులు దశలవారీగా నిర్వహించారు. హరితహారంలో గుంతలు తవ్వించడంతోపాటు మొక్కలు నాటించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఉపాధిహామీ కూలీలకు రూ.10 కోట్ల మేరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో నిత్యం పనిచేస్తేగానీ పొట్టగడవని కూలీలు ఆందోళన చెందుతున్నారు. డబ్బులు రాకపోవడంతో ప్రస్తుతం అనుమతులు వచ్చిన పనులు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
కష్టంగాఉంది
రోజువారి కూలీ చేస్తేనే పొట్టగడిచేది.మూడు నెలలుగా ఉపాధిహామీ పనులు చేస్తూ వచ్చాం. కానీ పైసలు మాత్రం మూడు నెలలుగా రావడం లేదు. దీంతో పొట్టగడటమే కష్టంగా ఉంది.
– తోట జమున, ఉపాధిహామీ కూలీ
వ్యవసాయ పనులకు పోతున్న
గత మూడు నెలలుగా ఉపాధిహామీ పథకంలో పనులు చేస్తూ వస్తున్నాం. మూడు నెలలుగా కూలీ డబ్బులు రాకపోవడంతో ఇంట్లో చిల్లిగవ్వ లేక వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ పొట్టగడుపుకుంటున్నాం.
– గొల్ల లక్ష్మి
బకాయి వాస్తవమే
ఉపాధిహామీ పథకంలో పనులు చేసిన కూలీలకు సుమారు రూ.10 కోట్ల మేరకు బకాయిలు ఉన్న మాట వాస్తవమే. ఇటీవలే హరితహారంలో పనిచేసిన కూలీలకు డబ్బులు చెల్లించాం. మిగతా వారికి పది రోజుల్లో చెల్లిస్తాం.
– వెంకటేశ్వర్‌రావు, పీడీ, కరీంనగర్