కావాలి..! వద్దు..!! | nirmal as separate district in telangana | Sakshi
Sakshi News home page

కావాలి..! వద్దు..!!

Aug 13 2016 3:02 PM | Updated on Sep 4 2017 9:08 AM

నిర్మల్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాల్సిందేనని కొందరు.. నిర్మల్ జిల్లా ప్రతిపాదనను విరమించుకోని పక్షంలో ఆదిలాబాద్ ప్రాంతం మరింత వెనుకబడిపోతుందని మరికొందరు..

 నిర్మల్‌ను జిల్లా  చేయాల్సిందేనని కొందరు..
 ప్రతిపాదన విరమించుకోవాలని మరికొందరు..
 సీఎం నిర్ణయానికే కట్టుబడాలని నిర్ణయం
 
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాల్సిందేనని కొందరు.. నిర్మల్ జిల్లా ప్రతిపాదనను విరమించుకోని పక్షంలో ఆదిలాబాద్ ప్రాంతం మరింత వెనుకబడిపోతుందని మరికొందరు.. ఏజెన్సీ మండలాలతో కలిపి ఆసిఫాబాద్ కేంద్రంగా నాలుగో జిల్లా చేయాలని ఇంకొందరు.. ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార పార్టీ నేతలు తమ అభిప్రాయాలు, విజ్ఞప్తులను మంత్రివర్గ ఉపసం ఘం సమావేశంలో వెల్లడించారు. ఆయా నియోజకవర్గాల స్థానిక డిమాండ్‌ల మేరకు నేతలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలుండడం గమనార్హం. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి వర్గ ఉపసంఘం పలు జిల్లాల ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. నిర్మల్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ శోభాసత్యనారాయణగౌడ్, ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ప్రతిపాదనను విరమించుకోవాలని, ఆదిలాబాద్ నుంచి నిర్మల్‌ను విడదీయడంతో ఇక్కడి ప్రాంతం అభివృద్ధి మరింత కుంటుపడుతుందని మంత్రి జోగు రామన్న మంత్రివర్గ ఉప సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ మండలాలతో ఆసిఫాబాద్ కేంద్రంగా నాలుగో జిల్లా చేయాలని విజ్ఞప్తి కూడా ఉపసంఘం ముందుకు వచ్చింది. 
 
మండలాల సర్దుబాటుపైనా..
కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా మండలాల సర్దుబాటు, కొత్త మండలాల ఏర్పాటు అంశంపై ఉపసంఘం ముందు ప్రస్తావనకు వచ్చింది. జన్నారం మండలాన్ని నిర్మల్ జిల్లా పరిధిలోకి తేవాలనే ప్రతిపాదనను విరమించుకుని, మంచిర్యాల(కొమురంభీం) జిల్లాలో కలపాలని అభిప్రాయం వ్యక్తమైంది. కొమురంభీం నడయాడిన సిర్పూర్(యూ) మండలాన్ని కొమురంభీం జిల్లాలో కాకుండా, ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉంచడం సరికాదని, ఈ మండలాన్ని మంచిర్యాల పరిధిలోకి తేవాలని అభిప్రాయం వ్యక్తమైంది. ఖానాపూర్ నియోజకవర్గాన్ని రెండు, మూడు ముక్కలు చేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్‌ను మొత్తంగా రెండు జిల్లాలకే పరిమితం చేయాలనే అభిప్రాయం ఎక్కువ మంది ప్రజాప్రతినిదులు, నేతలు వ్యక్తం చేసినట్లు సమాచారం.  
 
సీఎం నిర్ణయానికి కట్టుబడాలని..
ఎవరికి వారు తమ అభిప్రాయాలు, విజ్ఞప్తులను వెల్లడించిన ప్రజాప్రతినిధులు, నేతలు జిల్లాల ఏర్పాటు, మండలాల సర్దుబాటు తదితర అంశాలపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నిర్ణయానికి వదిలేయలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు అందరు ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉంటామని మంత్రివర్గ ఉపసంఘం ముందు వెల్లడించారు. 
 
జ్ఞానసరస్వతీ జిల్లాగా పేరుపెట్టాలి
భైంసా : కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తున్న నిర్మల్‌కు  జ్ఞానసరస్వతీ జిల్లాగా నామకరణం చేయాలని ముథోల్ ఎమ్మెల్యే విఠ ల్‌రెడ్డి అభిప్రాయం వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పాల్గొన్నారు. నిర్మల్‌ను జిల్లాగా చేసేందుకు ఉన్న కారణాలను వెల్లడించారు. ముథోల్ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని నిర్మల్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని విఠల్‌రెడ్డి పేర్కొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement