మరో వారం రోజుల్లో నగరపాలక సంస్థకు నూతన కమిషనర్ రానున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
అనంతపురం న్యూసిటీ : మరో వారం రోజుల్లో నగరపాలక సంస్థకు నూతన కమిషనర్ రానున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నగరపాలక సంస్థలో పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపుగా పది మంది కమిషనర్లు మారారు. గ్రూపు రాజకీయాల నడుమ ఇక్కడ పని చేయాలంటే హడలిపోతున్నారు. దీంతో ఈ సీటులో వచ్చేందుకు అధికారులు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఏపీఎండీపీలో ప్రాజెక్టు మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మూర్తిను కమిషనర్‌గా పంపేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
మరో వారం రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని డీఎంఏ వర్గాలు తెలిపాయి. మంత్రి నారాయణ పేషీ నుంచే జీఓను విడుదల చేసి కమిషనర్‌ను ఎంపిక చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతి, గ్రూపు తగాదాలు సీఎం దృష్టికి Ðð వెళ్లాయి. పరిపాలనపరంగా ప్రజాప్రతినిధులు అతిగా నగరపాలక సంస్థపై జోక్యం చేసుకోకూడదని ఇద్దరు ప్రజాప్రతినిధులకు అధిష్టానం హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులపై దాడులు, అవినీతితో పార్టీ పరువును రోడ్డుకు ఈడుస్తున్నారని అధిష్టానం సీరియస్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. మరోసారి కమిషనర్‌పై ఎవరైనా దూకుడుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చర్యలుంటాయని స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. నూతనంగా బాధ్యతలు తీసుకునే అధికారి పాలకుల ఒత్తిళ్లకు ఏ మేరకు తట్టుకుంటారో వేచి చూడాలి.