వారు చెబితే..ఓకే


 


  • ప్రభుత్వ పనుల్లో ముఖ్యనేత అనుచరుల హవా

  • ముడుపులు ఇస్తేనే ముందుకు

  • నీరు–చెట్టు పనుల్లో కన్వీనర్‌ ఆయకట్టు కనికట్టు


 


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : విడవలూరు, కొడవలూరు మండలాల్లో ఏ పని కావాలన్నా వారి అనుగ్రహం ముందుగా పొందాలి. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్‌ చేసి కలెక్షన్‌ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న వీరికి ముడుపులిస్తేనే ముందుకు సాగుతారు. వీరెవరో కాదు..  కోవూరు నియోజకవర్గంలోని ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులు! ప్రభుత్వపరంగా ఆదాయం వచ్చే పనులు ఏమున్నా ముందుగా వీరిని సంప్రదించాలి. నీరు–చెట్టు, ఎఫ్‌డీఆర్, సీఈ మంజూర్లు, సీఎం రిలీఫ్‌ ఫండ్, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లు.. ఇలా పథకం ఏదైనా వీటిని పొందాలంటే ముందుగా ఆయా వ్యక్తులు వీరికి డబ్బు చెల్లించాల్సిందే. ప్రధానంగా ఓ తెలుగు తమ్ముడి భార్య అకౌంట్‌లో ఐదు నుంచి పది వేలు పడాల్సిందే. మరీ ముఖ్యంగా నీరు–చెట్టు పనులకు ముడుపుల పోటు ఎక్కువైంది. ఈ పనులు మంజూరు అయిన అనంతరం 3 శాతం డబ్బులు చెల్లించి వాటిని చేసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకోవాల్సిందే. ఈ విషయమై రైతులు ఎన్ని సార్లు ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

నిధుల దోపిడీ

నీరు – చెట్టు పథకంలో జరిగిన అవినీతిపై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి. మొదటి విడత నీరు – చెట్టుపై అప్పటి కలెక్టర్‌ జానకి విజిలెన్స్‌ ఎంక్వయిరీ చేశారు. రెండో విడత పనులపై రైతులు లోకాయుక్తను ఆశ్రయించారు. 60–40 శాతం వాటాలపై పెద్ద దుమారమే రేగింది. నీరు–చెట్టు పనుల్లో అవినీతిని అరికట్టడం వల్లకాక అధికారపార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది. విడవలూరు మండలంలో సెంటు భూమి కూడా లేని సీహెచ్‌ కృష్ణచైతన్య అనే వ్యక్తిని పార్లపల్లి ఆయకట్టుదారు కమిటీ కన్వీనర్‌గా చేసి నీరు – చెట్టు పనులను మంజూరు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా విడవలూరు, కొడవలూరు జేఈ, బుచ్చిరెడ్డిపాళెం డీఈలు ఈయన పేరు మీద లక్షలాది రూపాయల పనులను మంజూరు చేశారని చెబుతున్నారు. మలిదేవి డ్రైన్‌లో పనులు మంజూరు చేసిన కాపీని  చూపిస్తున్నారు. 

 

ఇంజనీర్లకు వత్తాసు.. 

నీరు–చెట్టు పనుల్లో తాము చెప్పినట్లు పనిచేసిన ఇంజనీర్లకు టీడీపీ ముఖ్య నేత వత్తాసు పలుకుతున్నారు. దీంతో జేఈ నుంచి డీఈ వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా పనుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఇంజనీర్లను బదిలీ చేస్తారని చెప్పిన అధికారపార్టీ నాయకులు తర్వాత మిన్నకుండి పోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ ఈ అవినీతిని అడ్డుకోవా లంటున్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top