ఒకే...ఒక్కరోజు... | mudragada padha yatra | Sakshi
Sakshi News home page

ఒకే...ఒక్కరోజు...

Jul 25 2017 6:29 AM | Updated on Jul 30 2018 7:57 PM

ఒకే...ఒక్కరోజు... - Sakshi

ఒకే...ఒక్కరోజు...

సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో హైటెన్షన్‌ చోటు చేసుకుంది. కాపు రిజర్వేషన్‌ అమలు చేయాలని కోరుతూ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న ‘చలో అమరావతి’ పాదయాత్రకు ఒక్క రోజు వ్యవధి ఉండటంతో ఉత్కంఠ నెలకుంది. అటు ప్రభుత్వం, ఇటు ముద్రగడ

పాదయాత్రకు క్లైమాక్స్‌
వేడెక్కిన పరిణామాలు
వెనక్కి తగ్గని ఇరువర్గాలు
చావోరేవో తేల్చుకుంటామంటున్న కాపులు
పాదయాత్ర జరగనిచ్చేది లేదంటున్న పోలీసులు
త్రిశంకు స్వర్గంలో టీడీపీ కాపు నేతలు


సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో హైటెన్షన్‌ చోటు చేసుకుంది. కాపు రిజర్వేషన్‌ అమలు చేయాలని కోరుతూ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న ‘చలో అమరావతి’ పాదయాత్రకు ఒక్క రోజు వ్యవధి ఉండటంతో ఉత్కంఠ నెలకుంది. అటు ప్రభుత్వం, ఇటు ముద్రగడ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వాతావరణం వేడెక్కింది. కిర్లంపూడిలోనే కాదు జిల్లా వ్యాప్తంగా పాదయాత్రపైనే చర్చ జరుగుతోంది. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలంతా భయపడుతుంటే...టీడీపీ నేతల పరిస్థితి మరో రకంగా ఉంది. అడకత్తెరలో పోకచెక్కలా వారి పరిస్థితి తయారైంది. ఉద్యమానికి దూరంగా ఉంటే కాపు సామాజిక వర్గం దూరమవుతుందని గుబులు వెంటాడుతుండగా, పోరాటానికి దగ్గరైతే అధిష్టానం ఆగ్రహానికి గురి కావల్సి వస్తుందేమోనని భయం పట్టుకుంది.  ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం బుధవారం ముద్రగడ పాదయాత్ర ప్రారంభం కావల్సి ఉంది.

కానీ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అటు ప్రభుత్వం, ఇటు ఉద్యమ నాయకులు తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవడంతో పరిణామాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అనుమతి లేని పాదయాత్రను కచ్చితంగా అడ్డుకుంటామని పోలీసులు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తుండగా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర చేసి తీరుతామంటూ ముద్రగడ బృందం తేల్చి చెబుతోంది. తమకిది చావోరేవోలాంటిదని కాపు జేఏసీ నాయకులు స్పష్టం చేయడంతో వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే పోలీసులు కిర్లంపూడిని అన్ని వైపులా మోహరించారు. ముద్రగడ నివాసాన్ని దాదాపు తమ అదుపులోకి తీసుకున్నారు. చెక్‌పోస్టులు, అవుట్‌ పోస్టులతో రహదారులన్నీ నిఘా వలయంలో ఉన్నాయి. ఒకవైపు పోలీసుల కవాతు, మరోవైపు కాపుల సమరభేరీతో జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు ఉద్రిక్త పరిస్థితిలో ఉన్నాయి. సెక‌్షన్‌ 144, సెక‌్షన్‌ 30తో పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఆంక్షలు పెడుతున్నారు.

 కాపులున్న గ్రామాలనైతే దాదాపు దిగ్బంధం చేస్తున్నారు. ఏ ఒక్కర్నీ బయటికి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర జరగనివ్వకూడదని పోలీసులు పక్కా పథకంతో ముందుకెళ్తున్నారు. ఆరు నూరైనా పాదయాత్ర చేస్తామంటూ జేఏసీ నాయకులు ధీటుగా స్పందించడంతో కిర్లంపూడిలో యుద్ధ వాతావరణం నెలకుంది. బైండోవర్‌, హెచ్చరికలు, నోటీసులు ఎప్పటిలాగానే కొనసాగుతున్నాయి. చట్టం తన పనిచేసుకు పోతుందనే ధోరణితో పోలీసులు అన్ని రకాల ఆంక్షలు పెడుతున్నారు. చావో రేవో తేల్చుకుంటామంటూనే బుధవారం పాదయాత్ర అడ్డుకుంటే...మరో రోజు ప్రారంభిస్తామని...తమదెలాగూ నిరవధిక పాదయాత్ర అని ముద్రగడతోపాటు జేఏసీ నాయకులు తేల్చి చెప్పడంతో పోలీసు వర్గాలు డైలామాలో పడ్డాయి.  

 ఇరకాటంలో టీడీపీ నేతలు
అందరి పరిస్థితి ఒకలా ఉంటే టీడీపీ కాపు నేతల పరిస్థితి మరో రకంగా ఉంది. జిల్లాలో కాపు ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది. కాపు జాతి కోసం జరుగుతున్న పోరాటంగా నిలిచిపోయింది. కాపులెవరైనా ఉద్యమానికి సహకరించకపోతే ద్రోహులగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడా సంక్లిష్ట పరిస్థితిని టీడీపీ నేతలు ఎదుర్కొంటున్నారు. అధినేత చంద్రబాబు కారణంగా టీడీపీ నేతలు కాపు ఉద్యమానికి దూరంగా ఉంటున్నారు. పదవులు పోతాయని, చంద్రబాబు ఆగ్రహానికి గురి కావల్సి ఉంటుందని జేఏసీ నేతలను పలుకరించడానికి కూడా భయపడుతున్నారు. దీంతో ఆ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే ఛీత్కరించుకుంటోంది. రిజర్వేషన్‌ కోసం పోరాడాల్సిందిపోయి తిరిగి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.  ప్రస్తుతానికైతే పదవులున్నాయి...భవిష్యత్తులో మన పరిస్థితేంటనే భయం టీడీపీ నేతలకు పట్టుకుంది. ఎందుకంటే, ఉద్యమం కారణంగా ఇప్పటికే కాపు సామాజిక వర్గం మండిపోతోంది. ఏ దశలోనూ అక్కున చేర్చుకునే పరిస్థితి లేదు. జేఏసీ నాయకులు కూడా చంద్రబాబు, టీడీపీ నేతల్ని టార్గెట్‌ చేసుకునే ఉద్యమం చేస్తున్నారు. దీంతో టీడీపీ నేతల్లో చెప్పుకోలేని టెన్షన్‌ మొదలైంది. ఏదేమైనప్పటికీ ముందుకెళితే నుయ్యి– వెనక్కి వెళితే గొయ్యి అన్న చందంగా పచ్చనేతల పరిస్థితి తయారైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement