వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ నేతల దాడులకు అడ్డుకట్ట పడడంలేదు.
వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తపై ఎమ్మెల్యే అనుచరుడి దాడి
May 6 2017 12:50 AM | Updated on May 29 2018 4:37 PM
– ఫిర్యాదు చేసిన బాధితుడు, పట్టించుకోని పోలీసులు
– నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే మణిగాంధీ
కర్నూలు సీక్యాంప్: వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ నేతల దాడులకు అడ్డుకట్ట పడడంలేదు. బుధవారం గీతాముఖర్జీనగర్‌లో నివాసముంటున్న వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త చాకలి నరేష్(28)ను అదే కాలనీకి చెందిన కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ప్రధాన అనుచరుడు అధికార పార్టీ నాయకుడు ఇ.సురేంద్ర గౌడ్ కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. చాకలి నరేష్ స్థానికంగా వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, అధికార పార్టీ ఇచ్చిన తప్పుడు వాగ్ధానాల గురించి స్థానికులకు వివరించేవాడు. దీన్ని మనసులో పెట్టుకుని సురేంద్ర గౌడ్ దాడి చేశాడని నరేష్ బంధువులు వాపోయారు. ప్రమాద స్థలంలో స్పృహ తప్పి పడిపోయిన చాకలి నరేష్‌ను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిపించారు. అతని తలకి, చేతికి దెబ్బతగలి 12కుట్లు పడ్డాయి. క్షతగాత్రుడి తల్లిదండ్రులు భార్య నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే దాడి చేసిన సురేంద్రగౌడ్ మణిగాంధీ అనుచరుడు కావడంతో పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement