మండలంలోని వాతంగి పంచాయతీ పరిధిలోని లోతట్టు గ్రామం ఓకుర్తిలో శుక్రవారం రాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి 10 గంటల తరువాత ఈ సంఘటన వెలుగులోకి రావడంతో జడ్డంగి, రాజవొమ్మంగి ఎస్సైలు నాగార్జున, రవికుమార్ ఘటనా
ఓకుర్తిలో యువకుడి దారుణ హత్య
Apr 9 2017 12:09 AM | Updated on Aug 21 2018 5:51 PM
రాజవొమ్మంగి (రంపచోడవరం) :
మండలంలోని వాతంగి పంచాయతీ పరిధిలోని లోతట్టు గ్రామం ఓకుర్తిలో శుక్రవారం రాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రాత్రి 10 గంటల తరువాత ఈ సంఘటన వెలుగులోకి రావడంతో జడ్డంగి, రాజవొమ్మంగి ఎస్సైలు నాగార్జున, రవికుమార్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఓకుర్తి గ్రామానికి చెందిన గోము వెంకటరమణ గ్రామ నడిబొడ్డున కోనేటి ప్రసాద్‌బాబును (27) కత్తితో నరికి హత్య చేశాడు. ఈ సంఘటనలో ప్రసాద్‌బాబు ఎడమ చేయి మణికట్టు వద్ద తెగిపోయింది. అరచేతిపై, భుజాలపై బలమైన గాయాలయ్యాయి. అలాగే గొంతుముడి తెగిపోవడంతో ప్రసాద్ సంఘటనా స్థలంలోనే రక్తపు మడుగులో కుప్పకూలాడని జడ్డంగి ఎస్సై నాగార్జున తెలిపారు. తన భార్యతో ప్రసాద్ అతి చనువుగా మసలుతున్నాడన్న అక్కసు, అనుమానంతో వెంకటరమణ ఈ దారుణానికి పాల్పడాడని తమ ప్రాథమిక విచారణలో తెలిందని ఎస్సై చెప్పారు. వెంకటరమణది మండలంలోని కరుదేవపాలెం గ్రామం కాగా ఓకుర్తి గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకుని అదే గ్రామంలో ఉంటున్నాడు. ప్రసాద్‌బాబుది ప్రత్తి పాడు మండలం కిత్తమూరుపేట గ్రామం కాగా ఓకుర్తి గ్రామానికి చెం దిన యువతితో వివాహం కుదిరింది. నిశ్చితార్థం కావడంతో ప్రసాద్‌బాబు ఓకుర్తి గ్రామంలోనే కాబోయే భార్య కుటుంబీకులతో ఏడాదిన్నరగా ఉంటున్నాడు. ప్రసాద్‌బాబుపై కక్షపెంచుకున్న వెంకటరమణ అదనుదొరకడంతో అతనిని హత్య చేశాడని ఎస్సై తెలిపారు. అడ్డతీగల సీఐ ముక్తేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అడ్డతీగల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని ప్రసాద్ కుటుంబీకులకు అప్పగించారు.
Advertisement
Advertisement