భర్తతో గొడవపడి తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
సంతోష్‌నగర్(హైదరాబాద్ సిటీ): భర్తతో గొడవపడి తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వివాహిత చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఎం.శంకర్ తెలిపిన వివరాల ప్రకారం... రక్షాపురం కాలనీ శివాలయం ప్రాంతానికి చెందిన మహ్మద్ అక్రం, సకీనా ఆలియాస్ శ్వేత (35)లు దంపతులు. వీరికి రెహాన్(7), ఆసద్(11 నెలలు) సంతానం. కాగా సకీనా గత తొమ్మిదేళ్ల కిందట అక్రంను మతాంతర వివాహం చేసుకుంది. శ్వేత వివాహం అనంతరం తన పేరును సకీనాగా మార్చుకుంది. మహ్మద్ అక్రం ప్రైవేటు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
గత కొన్ని రోజులుగా ఇంట్లో భార్యభర్తల మధ్య ఆర్థిక, ఇతర సమస్యలపై గొడవలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి భార్యభర్తల మధ్య మరోసారి తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. భర్త ఇంట్లో లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సకీనా రాత్రి 11.30 గంటల సమయంలో ఇంట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని గమనించిన కుమారుడు రెహాన్ విషయాన్ని ఫోన్‌లో మామయ్య గోవింద్‌కు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న గోవింద్ స్థానికులతో కలిసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై శుక్రవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.