వివాహిత ఆత్మహత్య | Married suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Nov 22 2016 1:39 AM | Updated on Nov 6 2018 7:56 PM

భర్తకు తెలియకుండా పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బును తన ఖాతాలో జమచేయలేదని మనస్థాపం చెంది రెడ్డెమ్మ (28) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలసముద్రంలో సోమవారం చోటు చేసుకుంది.

తనకల్లు : భర్తకు తెలియకుండా పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బును తన ఖాతాలో జమచేయలేదని మనస్థాపం చెంది రెడ్డెమ్మ (28) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలసముద్రంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రెడ్డెమ్మ తన భర్త కొండప్పకు తెలియకుండా రూ. 40 వేలు పోగు చేసుకుంది. దాచుకోడానికి సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ డబ్బును రూ. 500, రూ. 1000 నోట్లుగా మార్చుకొని ఎవ్వరికీ తెలియకుండా ఇంట్లో దాచుకుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేయడంతో భయపడిన రెడ్డమ్మ మొత్తం డబ్బును భర్త చేతికి ఇచ్చి ఏపీజీబీలోని తన ఖాతాలో వేయాలని చెప్పింది. కాగా తన భార్య పేరున ప్రభుత్వం పక్కా గృహాన్ని మంజూరు చేసి ఉండడం, ఈ డబ్బు ఆమె ఖాతాలో వేస్తే ఎక్కడ ఇల్లు రద్దు అవుతుందేమోనని భావించిన కొండప్ప ఆ మొత్తాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తరువాత ఈ విషయంపై ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.  ఆదివారం రాత్రి కొండప్ప వ్యాపారం కోసం ధర్మవరానికి వెళ్లాడు. రెడ్డెమ్మ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇంట్లో నిద్రిస్తోంది. తెల్లవారుజామున ఇంట్లోనే ఉరి వేసుకుంది. పిల్లలు ఇద్దరు లేచి గట్టిగా కేకలు వేశారు.  స్థానికులు అక్కడికి చేరుకుని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నిస్తుండగా ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి ఉత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement