పునరావాస జాబితాలను సిద్ధం చేయండి.

పునరావాస జాబితాలను సిద్ధం చేయండి.


► జాయింట్‌ కలెక్టర్‌ చక్రధర్‌బాబు



హిరమండలం : వంశధార రిజర్వాయర్‌కు సంబంధించి పునరావాసం కల్పించని, కల్పించిన నిర్వాసిత కుటుంబాల జాబితాలను సిద్ధం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కె.వి.ఎన్‌ చక్రధర్‌బాబు అధికారులను ఆదేశించారు. గురువారం హిరమండలం సమీపంలోని బస్టాండ్‌ వెనుక భాగంలో గార్లపాడు, హిరమండలం నిర్వాసితుల పునరావాసం  కోసం కేటాయించిన స్థలాన్ని జేసీ పరిశీలించారు. పాలకొండ ఆర్డీవో ఆర్‌ గున్నయ్య, తహసీల్దార్‌ ఎం.కాళీప్రసాద్‌రావులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ స్థలం లోతట్టుగా ఉండటంతో నిర్వాసితులు ఇక్కడ పునరావాసం నిర్మించుకునేందుకు ముందుకురావడం లేదని తహసీల్దార్‌ జేసీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ స్థలానికి బదులు ప్రభుత్వం కేటాయిస్తున్న రూ.5 లక్షల ప్యాకేజీ కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం జేసీ మాట్లాడుతూ నిర్వాసిత గ్రామాల్లో ఇంకా ఎంతమంది పునరావాసం, ప్యాకేజీ కోరుతున్నారో గ్రామాల వారీగా తక్షణం జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. జేసీ వెంట వంశధార ఎస్‌ఈ కె.అప్పలనాయుడు, డీఈ, ఆర్‌ఐలు గౌరీశంకర్, నీలిమ, వీఆర్వో ఆనందరావు తదితరులు ఉన్నారు.



పునరావాస కాలనీ నిర్మాణాలు వేగవంతం

కొత్తూరు: వంశధార ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న పునరావాస కాలనీల నిర్మాణాలు వేగవంతం చేయాలని జేసీ చక్రధర్‌బాబు ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. మండలంలోని మోట్టూరు వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీలను జేసీ గురువారం పరిశీలించారు. కాలనీలో బోర్లు పాడైపోవడంతో తాగునీటికి, ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు పడుతున్నట్లు నిర్వాసితులు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అనంతరం జేసీ మాట్లాడుతూ అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. రోడ్లు, కాలువలు, మంచినీటి పథకాలు నిర్మాణం పూర్తి చేయాలన్నారు. విద్యుత్‌ కనెక్షన్లు వేయాలని సూచించారు. ఆయనతో పాటు కొత్తూరు తహసీల్దార్‌ సావిత్రి, ఆర్‌ఐ భీమారావు, వీఆర్వో సంగమేశ్వరరావు, రెవెన్యూ అధికారులు ఉన్నారు.



పనులు చేపడితే సహించం

సింగిడి(భామిని): వంశధార ప్రాజెక్టుకు సంబంధించి పునరావాస చట్టం ప్రకారం పరిహారం అందించేవరకు పనులు జరగనివ్వబోమని సింగిడి దళితకాలనీ నిర్వాసితులు స్పష్టం చేశారు. గురువారం భామిని మండలం సింగిడి దళితకాలనీకి వెళ్లిన రెవెన్యూ, భూసేకరణ, వంశధార అధికారులను స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సింగిడి దళిత కాలనీకి పునరావాస పరిహారం అందే అవకాశాలు లేవని ఉత్తర్వులు అందాయని, డీ–పట్టా భూముల్లో చెట్లకు పరిహరం వస్తుందని అధికారులు చెప్పగా నిర్వాసితులు అడ్డుతగిలారు. వరద కాలువకు 65 మీటర్ల దూరంలోని గృహ సముదాయాన్ని సర్వే చేసి గుర్తించి ఇప్పుడు పరిహరం రాదని చెప్పడం తగదన్నారు. న్యాయం జరిగే వరకు పనులు ముందుకు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. దీంతో తహసీల్దార్‌ జల్లేపల్లి గోపాలరావు, వంశధార ఈఈ విజయకుమార్, డీఈఈ నాగేశ్వరరావు, భూసేకరణ అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి సిర్ల ప్రసాద్, నిర్వాసితుల సంఘ అధ్యక్షుడు పి.గణపతి, వైఎస్సార్‌ సీపీ నాయకుడు మజ్జి సంజీవ్, మజ్జి కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top