‘కొయ్యగుర్రం’.. కొత్తరూపం | 'Koyya gurram'.. new form | Sakshi
Sakshi News home page

‘కొయ్యగుర్రం’.. కొత్తరూపం

Oct 14 2016 6:05 PM | Updated on Sep 4 2017 5:12 PM

‘కొయ్యగుర్రం’.. కొత్తరూపం

‘కొయ్యగుర్రం’.. కొత్తరూపం

కొయ్యగుర్రం... 1977 నవంబరు 19న సాగరమెత్తిన జలడ్గానికి తెగిన అసంఖ్యాక దీన మానవుల తలలకి నగ్నముని అనే కవి అర్పించిన జలతర్పణం.

* ఒకనాటి సంచలనం..
రాజకీయ దీర్ఘకవిత ‘కొయ్యగుర్రం’
* దృశ్యకావ్యంగా కొత్త ప్రయోగం 
* అప్పటి పంక్తులు ఇప్పటికీ  
వర్తిస్తాయంటున్న సుప్రసిద్ధ కవి నగ్నముని
 
తెనాలి: కొయ్యగుర్రం... 1977 నవంబరు 19న సాగరమెత్తిన జలడ్గానికి తెగిన అసంఖ్యాక దీన మానవుల తలలకి నగ్నముని అనే కవి అర్పించిన జలతర్పణం. రాజకీయ అంశాన్ని తొలిసారి సాహితీ విలువగా ప్రకటించిన ఈ తొలి దీర్ఘకవిత, ఆధునిక మహాకావ్యంగా కీర్తినందుకొంది. తొలి రాజకీయ, తాత్విక మహాకావ్యంగా కావ్యాలకు, దీర్ఘ కవితలకు ఒరవడి పెట్టింది. తొమ్మిది భాషల్లో అనువాదమైంది. కవి తాత్వికుడు అయినందునే ఇది సాధ్యపడింది. నగ్నముని అభిమానులతో∙ఇప్పుడీ రచన దృశ్యరూపం సంతరించుకోనుంది. అంతర్జాతీయ స్థాయి డాక్యుమెంటరీ సినిమాగా రూపొందనుంది.  ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన తెనాలి కవి నగ్నముని, ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
 
1977లో ఉప్పెన విజృంభణ... కొన్ని వేలమంది చనిపోయారు. గ్రామాలకు గ్రామాలు సమాధి. తుపానును ఎటూ శాసించలేం. మిగిలిన ప్రాణాలను పట్టించుకొనేదెవరు? పైగా ఇంకో తుపాను వస్తే బాగుండనుకున్నారు కొందరు. దానివెనుక డబ్బులు, వ్యాపారాలున్నాయి. ఆ ఆవేదనలోంచి వచ్చిందే ‘కొయ్యగుర్రం’. రాజకీయ అంశాన్ని తొలిసారి సాహిత్యంలో ప్రవేశపెట్టిన కావ్యమిది. ప్రస్తుతం డాక్యుమెంటరీ రూపంలోకి తీసుకొస్తూ కొత్త ప్రయోగానికి నాంది పలికారు మిత్రులు. నిర్దేశిత బాధ్యతను ప్రముఖ ఆర్ట్‌ ఫిలింమేకర్‌ నటరాజ్‌ మహర్షి స్వీకరించారు. ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌గా న్యాయవాది వేణుగోపాలరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆడియో రికార్డింగ్‌ పూర్తయింది.
 
స్వాతంత్య్రం సిద్ధించాక.. సొంత పరిపాలన వస్తుందని సంబరపడ్డాం. సమాజానికి రాజ్యానికి సంబంధం లేకుండాపోయింది. పారిశ్రామిక విప్లవంతో చేతివృత్తులన్నీ దెబ్బతిన్నాయి. దీన్ని తట్టుకొని వృత్తిదారుల జీవితాలు సజావుగా సాగేందుకు ఏం చేశారు? శాస్త్ర ప్రగతి శరవేగమవుతుంటే, దానికి అనుసంధానంగా పౌరజీవితాలు ఉండేలా చూసుకోవాల్సిన ప్రణాళికలు ఎప్పుడైనా అమలు జరిగాయా..? శాస్త్ర విప్లవాన్ని ఆపొద్దు... నడుం విరిగినవాళ్లను ఎలా బతికించాలనేది ఆలోచించాలి కదా..? శాస్త్రీయ దృక్పథం లేనందునే జీవితాలు నాశనమయ్యాయి. ప్రజాప్రతినిధులు సంక్షేమం పేరుతో ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారు. జవాబుదారీతనం లేని వ్యవస్థను తయారుచేశారు. ఎవరికైనా అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లటం మినహా ప్రభుత్వం దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు.
 
ఏదైనా ఉద్యోగానికి వెళితే.. అనుభవం ఏమిటని అడుగుతారు... అర్హతలను ప్రశ్నిస్తారు. ప్రజాప్రతినిధి కావటానికి ఏ అర్హతలు లేవు, ఏ ప్రాతిపదికన ఎన్నుకోవాలో లేదు. కులం ఎంటి? మతం ఏంటి? డబ్బుందా? అనడుగుతున్నారు. అందువల్లే ఈ డొల్లతనం. యోగ్యతలు లేనివారు ధనం ప్రాతిపదికగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఫలితంగానే బాధ్యతలేని ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. కనీసం ఎవరేం చేయాలనే పని విభజన కూడా తెలీదు. అయోమయ ఆలోచనలతో మనల్ని ఎక్కడకు తీసుకెళుతున్నారో తెలీదు. పాత చట్రంలో కొత్త సమస్యలకు పరిష్కారం ఉండదు. ప్రజలకీ భ్రమలపై ఎరుక కావాలి. అప్పుడే వాళ్లు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించుకుంటారనే భావనతో ఆనాడు కొయ్యగుర్రం రాశాను. నిజానికి ఇప్పటికీ ఇది రిలవెంట్‌ ఫర్‌ అవర్‌ ఇండియా. ఇంకా పెరుగుతూనే వుంటుంది. ఒకవేళ ఇప్పుడు గనుక నేను రాయాల్సివస్తే, కొయ్యగుర్రం అని కాదు... ‘ఇనుపగుర్రం’ అని రాస్తాను.
 
విదేశీ భాష వద్దు, వస్త్రాలొద్దు... అని ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమం చేశాం. మరిప్పుడో..? మన పిల్లల్ని విదేశాలకు పంపుతున్నారు. ఇప్పటి ప్రభుత్వాలు విదేశాలకు వెళ్లి, వాళ్ల కంపెనీలను ఇక్కడ స్థాపించమని ఆహ్వానిస్తున్నాయి. కల్పించే సౌకర్యాలపై హామీలిస్తున్నాయి. ఎందుకిలా? ఫ్రీడం స్పిరిట్‌ మొత్తం పోయింది.  ఒక భ్రమను డెవలప్‌ చేయటం వల్ల ప్రజలు అన్నిటినీ నమ్ముతారు. రాజ్యమనే కొయ్యగుర్రం ఒక భ్రమ... కదులుతుందనే భ్రమను కల్పిస్తుందేగాని, నిజంగా ఇప్పటికి ఆడియో రికార్డింగ్‌ పూర్తయింది.

Advertisement
 
Advertisement
Advertisement