కాపులను బీసీల్లో చేర్చుతాం
రాష్ట్రంలోని కాపు, బలిజలను బీసీ జాబితాలో చేరుస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప అన్నారు.
ఆత్మకూరు: రాష్ట్రంలోని కాపు, బలిజలను బీసీ జాబితాలో చేరుస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప అన్నారు. పట్టణంలో ఆదివారం కాపు, బలిజ కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాపుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 1500 కోట్లు నిధులను మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లాలో కాపు, బలిజల కల్యాణ మండపాల ఏర్పాటుకు రెండు ఎకరాల పొలాన్ని, రూ. 5కోట్ల నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ కాపు,బలిజలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ చెలమశెట్టి రామానుజ, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్, జిల్లా బలిజ సంఘం అధ్యక్షులు శెట్టినారాయణరెడ్డి కాపు, బలిజ సంఘం డివిజన్ నాయకులు పసుపులేటి వెంకటేశ్వర్లు, సాయికృష్ణమూర్తి, తోట వెంకటరమణ, శివరాము, నాగ తిప్పయ్య, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.