‘లక్ష్మీ’ కటాక్షమెప్పుడో..?
దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న బీసీ, ఈబీసీ కులాలకు చెందిన యువతుల వివాహ సందర్భంగా ప్రభుత్వం సహాయం అందించేందుకు ఉద్దేశించిందే కల్యాణ లక్ష్మి పథకం.
-
బీసీ, ఈబీసీలకు అందని కల్యాణలక్ష్మి డబ్బులు
-
నిధులున్నా నిష్ప్రయోజనం
-
ఆందోళనలో లబ్ధిదారులు
ఆదిలాబాద్ రూరల్ : దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న బీసీ, ఈబీసీ కులాలకు చెందిన యువతుల వివాహ సందర్భంగా ప్రభుత్వం సహాయం అందించేందుకు ఉద్దేశించిందే కల్యాణ లక్ష్మి పథకం. ఈ పథకం ద్వారా ఆడపిల్ల పెళ్లి సందర్భంగా ప్రభుత్వం రూ.50,000 అందిస్తుంది. ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు సహాయం అందడం లేదు.
కల్యాణలక్ష్మి వర్తిస్తుందని కలలు కన్న ఆడపిల్లల తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. పథకం ప్రకటించి నాలుగు నెలలు గడుస్తున్నా నేటికీ లబ్ధిదారుల ఖాతాలోకి నగదు జమ కావడం లేదు. ప్రభుత్వం మార్గదర్శకాలను సరిగా సూచించకపోవడం, అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో జాప్యం చేయడమే పథకం ప్రజలకు చేరువకాకపోవడానికి గల కారణాలని తెలుస్తోంది.
నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి...
గతంలో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు కల్యాణ లక్ష్మి, మైనార్టీలకు షాదీముబారక్ పేరుతో పథకాలను ప్రారంభించింది. పథకం అమలులో అవినీతి, అక్రమాలు జరిగాయని ఏసీబీ తేల్చడంతో బీసీల విషయంలో అలా జరగకుండా పకడ్బందీగా అమలు చేసేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వం సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారా అందించాలని నిర్ణయించింది.
ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఆదిలాబాద్‌లో బీసీలు 159, ఈబీసీలు 03, జైనథ్ మండలంలో బీసీ 99, బేల మండలంలో 63, మొత్తం 324 మంది వివాహం చేసుకున్న యువతులు కల్యాణ లక్ష్మి పథక లబ్ధి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని మంజూరుకు తమ కార్యాలయానికి వచ్చిన్నట్లు అధికారుల రికార్డులు పేర్కొంటున్నాయి. ఇవే కాకుండా మరిన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ప్రభుత్వం పేరు కోసం పథకాలను ప్రకటించి అమలు మరిచిపోతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి, లబ్ధిదారులకు అందజేయాలని కల్యాణలక్ష్మి లబ్ధిదారులు కోరుతున్నారు.