నిఘా వర్గాల దర్యాప్తు వేగవంతం

నిఘా వర్గాల దర్యాప్తు వేగవంతం

 

  •  కోర్టు ఆవరణలో ఓ బాక్స్‌స్వాధీనం?

  •  అణువణువున తనిఖీలు

నెల్లూరు (క్రైమ్‌) :  కోర్టు ఆవరణలో బాంబు పేలుడు ఘటనపై కేంద్ర, రాష్ట్ర  నిఘావర్గాలు దర్యాప్తును వేగవంతం చేశాయి. ఇప్పటికే ఇంటలిజెన్స్‌ బ్యూరో, కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ బృందాలు పేలుడుకు గురైన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడుకు ఎలాంటి పరికరాలు, ఏయే పదార్థాలను వినియోగించారు తదితరాలపై ఓ అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. పేలుడు అనంతరం లభ్యమైన అవశేషాలను పరిశీలించారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీస్‌ బృందం అవశేషాలన్నింటిని స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం తమ వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో చిత్తూరు కోర్టు ఆవరణలో జరిగిన బాంబు పేలుడు, నెల్లూరు కోర్టు ఆవరణలో జరిగిన బాంబు పేలుడు ఒకే తరహాలో ఉండటంతో ఉగ్రవాద చర్యగా నిఘా వర్గాలు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. అయితే అంతటితోనే కాకుండా విభిన్న కోణాల్లో సైతం విచారణ సాగిస్తున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఎవరో కావాలనే భయాందోళనకు గురి చేసేందుకు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని చెబుతున్నారు.  

క్షేత్ర స్థాయిలో విచారణ 

క్షేత్రస్థాయిలో విచారణ చేసి పేలుడు వెనుక సూత్రధారులను కనుగొనే ప్రయత్నంలో జిల్లా పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిషేధిత ఉగ్రవాద సంస్థలు, వారి కార్యకలాపాలు, అసాంఘిక శక్తులు తదితరాల వివరాల సేకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్నీ హోటల్స్, లాడ్జిలు, శివారు ప్రాంతాల్లోని గృహాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో సోదాలు, వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన కూడళ్లు, అన్ని ప్రార్థనా మందిరాల వద్ద పోలీసు పికెట్‌లు ఏర్పాటు చేశారు. ఇకపై ప్రతి రోజు బాంబ్, డాగ్‌స్క్వాడ్‌లు తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు.  ప్రమాదం జరిగిన కోర్టు ఆవరణలో బుధవారం బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌లు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. పేలుడు జరిగిన ప్రాంతాన్ని జిల్లా జడ్జి పరిశీలించారు. బుధవారం సాయంత్రం జిల్లా కోర్టు ఆవరణలోని రిజిస్ట్రార్‌ కార్యాలయం సమీపంలో ఫ్లిప్‌కార్ట్‌ బాక్స్‌ను బాంబ్‌స్క్వాడ్‌ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.  

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top