అహోబిల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ | inauguration for ahobilam brahmotsavas | Sakshi
Sakshi News home page

అహోబిల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Mar 3 2017 11:14 PM | Updated on Sep 5 2017 5:06 AM

అహోబిల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

అహోబిల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

దిగువ అహోబిల క్షేత్రంలో శుక్రవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ పూజలు నిర్వహించారు.

అహోబిలం (ఆళ్లగడ్డ): దిగువ అహోబిల క్షేత్రంలో శుక్రవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ పూజలు నిర్వహించారు. మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. దిగువ అహోబిలంలోని శ్రీ ప్రహ్లాద వరదస్వామి ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ అర్చకులు.. విశ్వక్సేనుడికి పూలమాలలు వేసి తల పాగా చుట్టి పల్లకిలో కొలువుంచి మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఆటంకాలు కలుగకుండా నిరంతరం పర్యవేక్షకుడిగా విశ్వక్సేనుడు వ్యవహరిస్తారని విశ్వాసం.
 
ఆలయానికి ఈశాన్యం వైపున ఉన్న పుట్ట మన్ను తీసుకొని వచ్చి.. కుంకుమ, పసుపుతో బ్రహ్మోత్సవ మండపాన్ని సుందరంగా అలకంరించారు. అంకుర హోమం నిర్వహించి సోముడిని (చంద్రుడిని) మట్టిలోకి ఆవాహం చేశారు. పాత్రలో ఉన్న మట్టిలో నవగ్రహాలకు సూచికగా నవధాన్యాలు పోసి సోమ కుంభస్థాపన చేశారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ సందర్భంగా శనివారం ఉదయం ధ్వజారోహణం, మధ్యాహ్నం అభిషేకం, సాయంత్రం భేరీపూజ నిర్వహించనున్నారు. రాత్రి సింహవాహనంపై స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement