వంకాయ కూర..చింతపండు చారు!

Sri Singaraya Narasimha Swamy Jathara Special Dishes - Sakshi

శ్రీ సింగరాయ లక్ష్మీనరసింహస్వామి జాతర స్పెషల్‌ 

నేటి జాతరకు ఏర్పాట్లు పూర్తి

సాక్షి, సిద్దిపేట: జాతర్లకు వెళ్లడం, పూజలు నిర్వహించడంతో పాటు అక్కడే వంటలు చేసుకుని తినడం సర్వసాధారణం. కొన్నిచోట్ల మాంసాహారంతో పాటు శాకాహారం వండుతారు. కొన్నిచోట్ల శాకాహా­రానికే పరిమితమవుతారు. కానీ శాకాహారం..అందులోనూ ‘ఆహా..ఏమి రుచి..అనరా మైమరచి..’ అం­టూ ఓ సినీ కవి అభివర్ణించిన వంకాయ కూర­తో పాటు చింతపండు చారు మాత్రమే చేసుకుని అన్నంతో కలిపి ఆరగించడం శ్రీ సింగరాయ లక్ష్మీనరసింహస్వామి జాతర స్పెషల్‌. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ సమీపంలోని కోహెడ మండలం కూరెల్ల–తంగళ్లపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఈ శ్రీ సింగరాయ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. దీని వెనకో కథ కూడా ఉంది.

కాకతీయుల కాలంలో ప్రారంభం
కాకతీయుల కాలంలో రాజులు అనువైన చోటల్లా చెరువులు తవ్వించారు. అందులో భాగంగా కాకతీయ చివరిరాజు ప్రతాపరుద్రుడు కూరెల్ల–తంగళ్లపల్లి గ్రామాల వద్ద చెరువు తవ్వే విషయం పరిశీలించాల్సిందిగా సంబంధిత నిపుణుడైన సింగరాయుడుతో పాటు మరికొందర్ని పంపించాడు. వారంతా కొద్దిరోజులు అక్కడే మకాం వేసి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న క్రమంలో బృందంలో కొందరు అనారో­గ్యంతో మరణించా­రు.

దీంతో సింగరా­య మినహా మిగిలిన వారంతా తమ పని మధ్యలోనే వదిలేసి ఓరుగల్లుకు తిరిగి­వెళ్లిపోయారు. సింగరాయ అక్కడే అడవిలో తిరుగుతున్న క్రమంలో ఓ చోట సొరంగంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కనిపించింది. ఆ విగ్రహానికి ఆయన భక్తి శ్రద్ధలలో పూజలు చేస్తూ వచ్చాడు. కొద్దిరోజుల తర్వాత సింగరాయుడు కూడా వెళ్లిపోయాడు.

ఆ తర్వాత సమీప గ్రామాల ప్రజలు లక్ష్మీనరసింహ స్వామికి పూజలు చేయడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే అక్కడ శ్రీ సింగరాయ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఏర్పడింది. ఏటా పుష్య అమావాస్య రోజున పెద్ద సంఖ్యలో భక్తులు సింగరాయ జాతర నిర్వహించడం ఆనవాయితీగా మారింది. శనివారం అమావాస్య పురస్కరించుకుని జాతర నిర్వహణకు రెవెన్యూ, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.

చెలిమ నీటిలో ఔషధ గుణాలు!
కూరెల్ల–తంగళ్లపల్లి గ్రామాలను ఆనుకుని మోయతుమ్మెద వాగు తూర్పు నుంచి పడమటకు దట్టమైన వన మూలికల చెట్ల మధ్య నుంచి ప్రవహిస్తుంది. దీంతో ఆ నీటిలో ఔషధ గుణాలు ఉంటాయనేది భక్తుల నమ్మకం. దీంతో ఈ వాగులో స్నానం చేసిన తర్వాత భక్తులు సింగరాయ నరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు.

వాగు చెలిమల (నీటి గుంటలు) నుంచి తీసిన నీటితో వంకాయ కూర, చింతపండు చారు సిద్ధం చేస్తారు. అల్లం, వెల్లుల్లి, జిలకర లాంటి వేమీ ఉపయోగించరు. స్వామికి నైవేద్యంగా సమర్పించాక  సహపంక్తి భోజనం చేస్తారు. మోయతుమ్మెద వాగు చెలిమ నీటితో చేసిన వంటలు రుచిగా ఉండటమే కాకుండా దివ్య ఔషధంలా పని చేస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఆరోగ్యానికి మంచిదనే స్థానికులు ఈ నీటిని వినియోగిస్తుంటారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top