
సంబురంగా హరితహారం
అందర‘మొక్క’టై కదులుదామంటూ.. హరితహారాన్ని సంబురంగా నిర్వహించారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
♦ జిల్లా వ్యాప్తంగా ప్రారంభం
♦ మొక్కలు నాటిన మంత్రులు హరీశ్‌రావు, పద్మారావు
♦ ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు..
♦ మొదటి రోజు ఐదు లక్షల మొక్కలు : కలెక్టర్
సాక్షి, సంగారెడ్డి : అందర‘మొక్క’టై కదులుదామంటూ.. హరితహారాన్ని సంబురంగా నిర్వహించారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజలు, ప్రజాప్రతినిదులు, అధికారులు పాల్గొని మొక్కలు నాటారు. జిల్లా మంత్రి హరీశ్‌రావు, ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తూప్రాన్‌లో హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. ఆ తర్వాత రామాయంపేటలోని సర్వాయికుంట సమీపంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను మంత్రులు హరీశ్‌రావు, పద్మారావు ఆవిష్కరించారు. జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి జెడ్పీ ఆవరణలో మొక్కలు నాటారు.
ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సోలిపేట రామలింగారెడ్డి, బాబూమోహన్, మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి ఎక్కడికక్కడ తమ నియోజకవర్గాల్లో నిర్విహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అధికారులూ ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్, కలెక్టర్ రోనాల్డ్ రోస్, జేసీ వెంకట్రాంరెడ్డి కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. సంగారెడ్డిలో కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం మొదటి రోజున జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సంగారెడ్డిలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్, చిద్రుప్పలోని పోలీసు శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈత చెట్లు నాటిని మంత్రులు
తూప్రాన్ బైపాస్‌రోడ్డులో మంత్రులు హరీశ్‌రావు, పద్మారావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఈత, ఖర్జూరం మొక్కలు నాటారు. గీతకార్మికులు, గౌడసంఘం నాయకులు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, కలెక్టర్ రోనాల్డ్‌రోస్, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌పి సింగ్, సీసీఎల్‌ఏ కమిషనర్ రేమండ్‌పీటర్ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్‌లోని మార్కెట్‌యార్డులో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ‘గడా’ ఓఎస్‌డీ హన్మంతరావు, గజ్వేల్-ప్రజ్ఞాఫూర్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట, మెదక్‌పట్టణం, మెదక్ మండలంలో జరిగిన కార్యక్రమాలలోనూ మంత్రి హరీష్‌రావు, డిప్యూటీస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి హాజరై మొక్కలు నాటారు.
జిల్లా కేంద్రంలో..
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మొక్కలు నాటారు. ఆయనతోపాటు సీసీఎల్‌ఏ రేమండ్‌పీటర్, కలెక్టర్ రోనాల్డ్ రోస్ తదితరులు మొక్కలు నాటారు. రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మొక్కలు నాటారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని తహశీల్దార్, ఎంపీడీఓ, వికలాంగుల పునరావస కేంద్రం, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు.
జహీరాబాద్‌లోని పండ్ల మార్కెట్ యార్డులో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎం.డి.ఫరీదుద్దీన్ మొక్కలు నాటారు.అందోలు నియోజకవర్గ కేంద్రమైన అందోలు, అల్లాదుర్గం మండలాలల్లో హరిత హారం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బాబూమోహాన్ ప్రారంభించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పలు మండలాల్లో పాల్గొని మొక్కలు నాటారు. హత్నూర మండలంలో పోలీసులు దత్తత తీసుకున్న కాసాల, చింతల్‌చెరువు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటారు. నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి ప్రారంభించారు. సంగారెడ్డిలోని డీసీసీబీ కార్యాలయం ఆవరణలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి అధికారులతో కలిసి మొక్కలు నాటారు.