
మల్లన్న సాగర్ ను కట్టి తీరుతం
‘రైతన్నలూ మేల్కొండి.. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలను అడ్డుకోండి’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
♦ కోటి ఎకరాలకు సాగు నీరిస్తాం
♦ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న
♦ ప్రతిపక్షాలకు రైతులు బుద్ధిచెప్పాలి
♦ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
దుబ్బాక/రామాయంపేట: ‘రైతన్నలూ మేల్కొండి.. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలను అడ్డుకోండి’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయని, ఇలాంటి ప్రతిపక్షం దేశంలో ఎక్కడా లేదన్నారు. సోమవారం దుబ్బాకలో మార్కెట్ కమిటీల పాలక వర్గాల ప్రమాణ స్వీకారోత్సవంలో, రామాయంపేటలో విలేకరులతో మాట్లాడారు. గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే తెలివిలేని కాంగ్రెస్, టీడీపోళ్లు నీళ్లు వద్దంటూ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నాలుగు ముంపు గ్రామాల్లో రాజకీయం చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్ని గ్రామాల రైతుల ఉసురు పోసుకుంటారని ప్రశ్నించారు. 60 ఏళ్లలో గత ప్రభుత్వాలు ఒక్క ప్రాజెక్టు కూ డా కట్టలేదని, తెలంగాణలో నిర్మించిన పులి చింతల ప్రాజెక్టులోని నీరు పారేది మాత్రం ఏపీలోని మూడు పంటలకని, అప్పుడు నోరు మెదపని ప్రతిపక్షాలు ఇప్పుడెందుకు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు.
ఏడు మండలాలు పోయినప్పుడు?
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను బలవంతంగా ఆంధ్రాలో కలుపుకున్నప్పుడు నోరు మెదపని టీడీపోళ్లు మల్లన్న సాగర్‌పై రాద్ధాంతం చేస్తూ, రాజకీయ శిఖండిలా వ్యవహరిస్తున్నారని మంత్రి విమర్శించారు. పులిచింతలో 14 గ్రామాలు, సింగూర్ ప్రాజెక్టులో 15 గ్రామాలు ముంపు గురైనా తెలంగాణలో మాత్రం ఒక్క ఎకరానికి సాగు నీరందలేన్నారు. బాధితులకు ఇప్పటివరకు పరిహారం కూడా అందలేదన్నారు. మునిగేది తెలంగాణ... పారేది ఆంధ్ర ప్రాంతానికన్నారు. 14 గ్రామాలు మునిగిపోతుంటే, తెలంగాణ నీరు ఆంధ్రాలో పారుతుంటే కాంగ్రెసోళ్లు ఎందుకు మాట్లాడలేదని హరీశ్ ప్రశ్నించారు. గోదావరి నీళ్లు వస్తాయని ఆనందపడాల్సింది పోయి కాంగ్రెసోళ్లు, టీడీపోళ్లు శిఖండిలా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు జీవనాధారమైన ప్రాజెక్టులను అడ్డుకునే ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపు నిచ్చారు.