హన్మకొండ నాలుగు ముక్కలు | Sakshi
Sakshi News home page

హన్మకొండ నాలుగు ముక్కలు

Published Mon, Aug 22 2016 12:15 AM

హన్మకొండ నాలుగు ముక్కలు - Sakshi

  • పది గ్రామాలతో కాజీపేట మండలం
  • హన్మకొండలో మిగులనున్న ఆరు గ్రామాలు
  • హన్మకొండ అర్బన్‌ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి ఆదివారం రెవెన్యూ యంత్రాంగం తీవ్రంగా కసరత్తు చేసింది. దాదాపు రాత్రి 11గంటల వరకు డీఆర్వో శోభ, పలువురు తహశీల్దార్లు ఇదే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారు. మొత్తంగా సోమవారం వెలువడనున్న ముసాయిదా ప్రకటనలకు కసరత్తు పూర్తి చేశారు. కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా హన్మకొండ మండలంలోని పలు గ్రామాలతోపాటు ధర్మసాగర్‌ మండలంలోని రాంపూర్‌ గ్రామాన్ని కలిపి కొత్తగా కాజీపేట కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. చుట్టుపక్కల ఉన్న 10 రెవెన్యూ గ్రామాలతో ఈ మండలం ఏర్పాటుకానుంది. 
     
    10 గ్రామాలు... 1.52లక్షల జనాభా
     
    కొత్తగా ఏర్పడబోయే కాజీపేట మండలంలో గతంలో ప్రసుతం హన్మకొండ మండలంలో ఉన్న న్యూశాయంపేట, కాజీపేట, సోమిడి, మడికొండ, తరాలపల్లి, భట్టుపల్లి, కొత్తపల్లి, అమ్మవారిపేట, కడిపికొండ గ్రామాలతో పాటు ధర్మసాగర్‌ మండలంలోని రాంపూర్‌ గ్రామాన్ని కూడా కలుపుతున్నారు. ఆయా పది గ్రామాల మొత్తం జనాభా 1.52,372గా ఉంది. ప్రస్తుతం అధికారులు 2011నాటి జనాభా లెక్కల ప్రకారం మండలాల ఏర్పాటుకు కసరత్తు చేపట్టారు. అయితే, తాజా లెక్కల ప్రకారం జనాభా ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు.
     
    ఖిలా వరంగల్‌కు మూడు గ్రామాలు...
     
    ప్రస్తుతం హన్మకొండ మండంలోని పైడిపల్లి, ఏనుమాముల, కొత్తపేట రెవెన్యూ గ్రామాలు ప్రస్తుతం ఉన్న వరంగల్‌ మండలంలో కలుపుతున్నారు. వాస్తవానికి పరిపాలనా పరంగా ఈ గ్రామాలు వరంగల్‌ మండలానికి సమీపంలో ఉంటాయి. ఈ మూడు గ్రామాల్లో జనాభా సుమారు 30వేల వరకు ఉంటుంది. అలాగే, హన్మకొండ మండలంలోని మామునూరు, నక్కలపల్లి, తిమ్మాపూర్, అల్లీపూర్‌ గ్రామాలను కొత్తగా ఏర్పడబోయే ఖిలావరంగల్‌ మండలంలో కలపాలని ప్రతిపాదించారు. ఈ గ్రామాల జనాభా సుమారు 20వేల వరకు ఉంటుంది. ఇక వర్ధన్నపేట మండలం నుంచి కొత్తగా ఏర్పడనున్న ఐనవోలు మండలంలో హన్మకొండ మండలం నుంచి కొండపర్తి, వనమాల కనపర్తి గ్రామాలు కలుపనున్నారు. ఈ రెండు గ్రామాల్లో జనాభా 8,481 ఉంది. అంతేకాకుండా హన్మకొండ మండలంలోని 24 రెవెన్యూ గ్రామాలకు గాను కొత్తగా ఏర్పడబోయే కాజీపేటకు తొమ్మిది గ్రామాలు, ఖిలా వరంగల్‌లోకి నాలుగు, ఐనవోలులోకి రెండు, పాత వరంగల్‌కు మూడు గ్రామాలు కలుపుతున్నారు. దీంతో హన్మకొండ పాత మండలంలో కేవలం ఆరు రెవెన్యూ గ్రామాలు మాత్రమే మిగులుతాయి. ఇలా హన్మకొండ మండలం నాలుగు ముక్కలు కానుంది.
     
    అయినా 2.32 లక్షల జనాభా
     
    2011 జనాభా లెక్కల ప్రకారం హన్మకొండ మండల జనాభా 4.32లక్షలుగా ఉంది. అయితే, మండల ఏర్పాటు, విభజనలో మండలంలోని 24 గ్రామాల నుంచి 18 గ్రామాలు విడిపోతాయి. ఇవిపోను హన్మకొండ, వడ్డేపల్లి, కుమార్‌పల్లి, గోపాలపురం, లష్కర్‌సింగారం, పలివేల్పుల రెవెన్యూ గ్రామాలతో హన్మకొండ మండలం మిగులుతుంది. అయినప్పటికీ ఆరు గ్రామాలు, 2.32లక్షల జనాభాతో పాత, కొత్త మండలాల్లో కలిపి జనాభాపరంగా జిల్లాలో హన్మకొండ పెద్ద మండలంగా మిగలనుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement