ఇంటి చుట్టూ పచ్చందమే! | Sakshi
Sakshi News home page

ఇంటి చుట్టూ పచ్చందమే!

Published Wed, Aug 10 2016 6:25 PM

మొక్కల మధ్య పద్మజ

  • వృద్ధుల ఆదర్శనీయం
  • మొక్కల మధ్యే జీవనం
  • ఆహ్లాదాన్ని పంచే పొదరిల్లు
  • జిన్నారం: ఆ ఇంట్లోకి వెళ్తే చాలు పచ్చదనం కనిపిస్తోంది. పచ్చతోరణమే స్వాగతం పలుకుతోంది. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. జిన్నారం మండలం అన్నారం గ్రామంలోని ప్రకృతి నివాస్‌లో ఈ ఇల్లు నందన వనంలా కనిపిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన సుబ్బారావు, పద్మజలు ప్రకృతి నివాస్‌లో నివాసం ఉంటున్నారు. ఉన్న ఇద్దరు కుమారులు యూఎస్‌లో ఉన్నారు.

    సుమారు 60- 70 ఏళ్ల వయస్సు ఉన్న సుబ్బారావు, పద్మజలు ఇంటి ముందు మొక్కలను పెంచుకుంటూ జీవిస్తున్నారు. కుమారులు యూఎస్‌ల ఉండటంతో వారికి ఎలాంటి పనులు లేకపోవటంతో మొక్కలు పెంచటమే పనిగా చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల నుంచి వివిధ రకాల మొక్కలను సేకరించి వాటిని పెంచే విధంగా ప్రతినిత్యం పనులు చేస్తుంటారు. మొక్కలే వారి స్నేహితులుగా మారాయి. 

    సుమారు 15 రకాల ఆకుకూరలు, 30రకాల పూల మొక్కలు, 15రకాల పండ్ల మొక్కలు, 10 రకాల షోకేజీ చెట్లతో పాటు తమలపాకు, అరటి, కొబ్బరి చెట్లను పెంచుతున్నారు. వివిధ రకాల ఔషధ మొక్కలను కూడా వారు పెంచుతున్నారు. ఇంట్లోపెంచిన ఆకుకూరలనే వంటలకు ఉపయోగిస్తున్నారు.

    కేవలం సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలను వాడుతుండటంతో ఆరోగ్యంగా ఉంటున్నామని వారు చెబుతున్నారు. ఈ మొక్కలతో ఇల్లు నందనవనంగా మారింది. హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని ప్రభుత్వం సూచిస్తుండగా, మొక్కలతో జీవనాన్ని సాగిస్తున్న ఈ వృద్ధ దంపతులు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

    ఆహ్లాద వాతావరణంలో జీవిస్తున్నాం
    ఇంటి చుట్టూ పచ్చటి మొక్కలతో ఆహ్లాదంగా జీవిస్తున్నాం. ఈ వయస్సులో చెట్ల మధ్య గడపటం సంతోషంగా ఉంది. తాము పండించిన ఆకు కూరలనే తింటాం. సేంద్రియ ఎరువులతోనే అన్ని రకాల మొక్కలను పెంచుతున్నాం. తాము ఇద్దరమే ఇంట్లో ఉండటంతో తమ సొంత బిడ్డల్లాగా చెట్లను పెంచుతున్నాం. చచ్చే వరకు తాము మొక్కలను పెంచుతూనే ఉంటాం. - పద్మజ, సుబ్బారావు

    నిత్యం పూలు కోసుకుంటా
    పద్మజ, సుబ్బారావులు ఇంటి నిండా మొక్కలను పెంచటం సంతోషంగా ఉంది. వారి ఇంట్లో ప్రతి రోజు తాను పూలు కోసుకుంటాను. తమ ఇంట్లో ఎలాంటి పూజా కార్యక్రమాలను నిర్వహించినా పూలు, పండ్లు, తమలపాకులను వారి ఇంట్లోనుంచే తీసుకొస్తామన్నారు.
    - సరిత. కాలనీ వాసురాలు

Advertisement
Advertisement