కొత్త ఎత్తుగడ | Sakshi
Sakshi News home page

కొత్త ఎత్తుగడ

Published Sat, May 21 2016 9:57 AM

governmet follows new strategy over bogapuram airport

భోగాపురం ఎయిర్‌పోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం రొజుకో ఎత్తుగడ వేస్తోంది. రైతుల వ్యతిరేకతతో కాసింత వెనక్కి తగ్గి వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. 5311.80 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని గతేడాది ఆగస్టులో ప్రాధమిక నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు 2004ఎకరాలకే పరిమితమని కొత్త పల్లవి అందుకుంది. ఆ మేరకు ఫేజ్1 పేరుతో  తుది నోటిఫికేషన్ కూడా విడుదల  చేసింది. ఇప్పటికిదే ఫైనల్ అంటూనే తదుపరి సంగతి చెప్పలేమంటున్న అధికార వర్గాల సన్నాయి నొక్కులు సర్కారు వ్యూహాన్ని చెప్పకనే చెబుతున్నాయి. దీనికంతటికీ ఆగస్టు నాటికి ప్రాధమిక నోటిఫికేషన్ కాలం చెల్లనుండటమే కారణం. ఈ లోపే ఎంతో కొంత భూసేకరణ పూర్తి చేయకపోతే మళ్లీ మొదటికొస్తుందనే ఈ నిర్ణయం.

సాక్షి ప్రతినిధి, విజయనగరం : భోగాపురం పరిసర ప్రాంతాల్లో 5311.80ఎకరాల్లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామని గతేడాది ఆగస్టులో సర్కారు ఫ్రిలిమనరీ నోటిఫికేషన్ ఇచ్చింది. తొమ్మిది రెవెన్యూ గ్రామాల పరిధిలో 3686 ఎకరాలను రైతుల నుంచి, 1625.69ఎకరాల ప్రభుత్వ భూమి సేకరిస్తామని అందులో పేర్కొంది. ఆనాటి నుంచి రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నారు. ఆందోళనలు చేస్తూనే న్యాయపోరాటానికి దిగారు. ఉన్నత న్యాయస్థానం కూడా రైతుల అభిప్రాయం లేకుండా ముందుకెళ్లొద్దని మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది. దీంతో అధికారులు భూసేకరణ అడుగులు వేయలేకపోయారు.

నాటకీయంగా ప్రిలిమనరీ నోటిఫికేషన్
వాస్తవానికి 2013 కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఎయిర్‌పోర్టు నిర్మించాల్సిందే!. రెండు చాప్టర్ల ప్రకారం ముందుకెళ్లాలి. అందులో ఒకటి  సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ స్టడీ ప్రకారం గ్రామాల్లో నిర్వాసితుల ఆమోదం మేరకే గ్రామసభలు నిర్వహించాలి. అభ్యంతరం చెబితే మాత్రం గ్రామసభలు నిర్వహించకూడదని చట్టం చెబుతోంది. రెండోది ఫుడ్ సెక్యూరిటీ యాక్టు ప్రకారం ఆయా భూములు వ్యవసాయ యోగ్యమయినవయితే, అక్కడి ప్రజలు వ్యవసాయాన్ని చేసుకునేందుకే ఇష్టపడితే ఆ భూములను సేకరించకూడదు. కానీ ఈ రెండు చాప్టర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సడలింపు ఆర్డినెన్స్ విడుదల చేసింది. ఈ ఆర్డినెన్స్ గతేడాది ఆగస్టు 31 వరకూ అమలులో ఉంటుందని పేర్కొంది. అందుకే 2015 ఆగస్టు 31 అర్ధరాత్రి వరకూ అధికార యంత్రాంగం కుస్తీలు పట్టి ప్రిలిమినరీ నోటిఫికేషన్ వెలువరించింది.

ఏడాదిలో ముగియనున్న కాలపరిమితి
సాధారణంగా ఫ్రిలిమనరీ నోటిఫికేషన్ కాల పరిమితి ఏడాదే. ఈ లోగా భూసేకరణ చేపట్టాలి. లేదంటే కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలి. ఒకవేళ రైతులు వ్యతిరేకిస్తే ప్రభుత్వం ముందుకెళ్లడానికి అవకాశం ఉండదు. ప్రస్తుత రైతుల వ్యతిరేకత నేపథ్యంలో ప్రిలిమనరీ నోటిఫికేషన్ ప్రకారం భూసేకరణ చేసే అవకాశం లేదు. ఇదంతా తలనొప్పి వ్యవహారమని, ప్రజా వ్యతిరేకతకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న భావనతో ప్రభుత్వం ప్రస్తుతానికి కాస్త వెనక్కి తగ్గింది. కొంతమేరకు తగ్గిస్తే రైతులు ముందుకు రావడమే కాకుండా న్యాయపరంగా పోరాటానికి కూడా వెనక్కి తగ్గుతారని ప్రభుత్వం అభిప్రాయపడింది.

తుది నోటిఫికేషన్‌లో కుదింపు
సర్కారు తాజాగా 2004ఎకరాలకు కుదిస్తూ తుది నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 1500 ఎకరాలు మాత్రమే రైతుల నుంచి సేకరిస్తామని సంకేతాలను పంపించింది. దీనివల్ల రైతులు కాసింత వెనక్కి తగ్గితే ఏదోలా తొలుత భూసేకరణ కానిచ్చేస్తే తదుపరి సంగతి చూసుకోవచ్చని, కావాలంటే మళ్లీ భూసేకరణ చేసుకోవచ్చనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వ్యూహంతోనే భూసేకరణకు సిద్ధమవుతోంది. ప్రభుత్వమిచ్చిన తుది నోటిఫికేషన్‌లో గూడెపువలస, బెరైడ్డిపాలెం, దల్లిపేట తదితర గ్రామాలకు ఊరట లభించినట్టే చెప్పాలి. వాటి శివారు గ్రామాలు మాత్రమే తాజా నోటిఫికేషన్‌లోకి వచ్చాయి.  
 
భూములిచ్చేది లేదు
రైతుల అంగీకారం తెలుసుకోకుండా ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు సరికాదు. కోర్టు ఉత్తర్వులను కూడా లెక్కచేయకుండా అధికారులు అనుసరిస్తున్న విధానంతో మేమంతా ఆందోళన చెందుతున్నాం. ఎటువంటి ధర ఇచ్చినా ఎయిర్‌పోర్టుకి భూములు ఇచ్చేది లేదు.
 - కొల్లి రామ్మూర్తి, రైతు, గూడెపువలస
 
ప్రజాభిప్రాయం తీసుకోవాలి
ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో, భూముల్లో ఉన్న రైతులు, గ్రామస్థులు తమ అసమ్మతి పత్రాలను అధికారులకు ఇచ్చినా పట్టించుకోలేదు. మండలంలో అన్ని పంచాయతీల్లో ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసి ఇచ్చినా పట్టించుకోకుండా బలవంతపు భూ సేకరణకు ప్రభుత్వం సిద్దం అవుతుంది. భూములు తీసుకోవాలంటే గ్రామసభలు పెట్టి వారి సమ్మతితోనే తీసుకోవాలి.
 - కాకర్లపూడి శ్రీనివాసరాజు,
 ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ సభ్యుడు
 2013 చట్టం ప్రకారమే చేయాలి
ప్రభుత్వ అవసరాలకు భూమి కావాలంటే 2013 చట్టం ప్రకారం మాత్రమే అధికారులు చర్యలు చేపట్టాలి. అంతే తప్ప ఏకపక్షంగా నియంతృత్వధోరణితో భూములు సేకరిద్దామంటే ఊరుకునేదిలేదు. గ్రామసభలు ఏర్పాటుచేసి 80శాతం మంది అంగీకారం తీసుకోవాలి. అలాగే బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరకు రెండున్నర రెట్లు అదనంగా అందించాలి.
 - ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి,
 ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ సభ్యుడు

Advertisement
Advertisement