'మహాత్మా'తో మంచి పేరు

'మహాత్మా'తో మంచి పేరు - Sakshi

– శ్రీరాఘవుడి సన్నిధిలో సినీ నటుడు శ్రీకాంత్‌

– అమ్మ అనే పదానికి నిర్వచనం జయలలిత

– వచ్చే నెలలో రారా చిత్రం విడుదల

మంత్రాలయం : మహాత్మా సినిమాతో తనకు మంచి గుర్తింపు లభించిందని సినీ హీరో శ్రీకాంత్‌ పేర్కొన్నారు. శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం బుధవారం ఆయన స్నేహితులతో కలిసి మంత్రాలయం వచ్చారు. స్నేహితుడు మనోహర్‌ (మహాత్మా సినిమా నిర్మాత, కర్ణాటక ఎమ్మెల్సీ) పుట్టినరోజును పురస్కరించుకుని మఠం యాగమండపంలో ఆయుష్షు, నవగ్రహ హోమం నిర్వహించారు. ముందుగా వారు గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతులు ఇచ్చారు. తర్వాత శ్రీరాఘవేంద్రస్వామి మూలబృందావనం చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి శ్రీమఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థులు శేషవస్త్రం, రాఘవేంద్రుల జ్ఞాపిక అందజేసి ఫల, పూల మంత్రాక్షింతలతో ఆశీర్వచనాలు గావించారు. అనంతరం శ్రీకాంత్‌ మాట్లాడుతూ మహాత్మా సినిమా నటనతో రాష్ట్రస్థాయి అవార్డు వచ్చిందన్నారు. ఆపరేషన్‌ దుర్యోధన, ఖడ్గం, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ చిత్రాలకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు వచ్చాయన్నారు. వచ్చే నెలలో తాను నటించిన రారా చిత్రం విడుదలవుతుందన్నారు. ఇప్పటి వరకు 122 చిత్రాల్లో నటించినట్లు వివరించారు. కర్ణాటకలోని గంగావతిలో జన్మించానని, చిన్నప్పటి నుంచి శ్రీమఠం వస్తున్నట్లు తెలిపారు.

‘అమ్మ’లేనిలోటు తీరనిది

 అమ్మగా పేరుగాంచిన జయలలిత లేని లోటు దేశానికి తీరనిదని శ్రీకాంత్‌ అన్నారు. మరెవరినీ ఆమె స్థానంలో ఊహించలేమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనసార దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. అనంతరం కొత్త హీరో ఈషాంత్‌ మాట్లాడుతూ పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో రోక్‌ అనే చిత్రంలో నటించానన్నారు. తెలుగు, కన్నడ, తమిళం భాషల్లో విడుదల అవుతుందన్నారు. వారికి మఠం అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి మర్యాద పూర్వకంగా ఆహ్వానం పలికారు.  

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top