ఉచితం.. వివాదం | Sakshi
Sakshi News home page

ఉచితం.. వివాదం

Published Tue, Sep 13 2016 10:55 AM

ఉచితం.. వివాదం

ద్వారకాతిరుమల(పశ్చిమ గోదావరి జిల్లా): ద్వారకాతిరుమల క్షేత్రంలో తిరుగుతున్న దేవస్థానం ఉచిత బస్సుల కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటూ పలువురు వ్యాపారులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రదేవత కుంకుళ్లమ్మ ఆలయం వద్ద ఉచిత బస్సులను అడ్డుకున్నారు. అధికారులు నిర్ణయం మార్చుకునే వరకు బస్సులకు అడ్డుతప్పుకునేది లేదంటూ నిరసనకు దిగారు. దీంతో క్షేత్రానికి వచ్చిన పలువురు భక్తులు ఇబ్బంది పడ్డారు. క్షేత్రానికి చేరుకునే యాత్రికులను స్థానిక గరుడాళ్వార్‌ సెంటర్‌ నుంచి ఉచిత బస్సుల ద్వారా దేవస్థానం అధికారులు కొండపైకి చేర్చేవారు. ఇలా చేయడం వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయంటూ కొండ కింద వ్యాపారులు లబోదిబోమంటున్నారు.

ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం దేవస్థానం బస్సులు నిలపడం వల్ల ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని ఆలయ అధికారులకు స్థానిక పంచాయతీ లిఖితపూర్వకంగా తెలియజేసింది. దీంతో యాత్రికులకు ఇబ్బంది కలుగకూడదన్న ఉద్దేశంతో బస్సు సర్వీసులను క్షేత్రదేవత కుంకుళ్లమ్మ ఆల యం వద్ద నుంచి కొండపైకి నడపడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామ మాజీ సర్పంచ్‌ మల్లిపెద్ది వెంకటేశ్వరరావు, కొండ దిగువ వ్యాపారులు కలసి కుంకుళ్లమ్మ ఆలయం వద్దకు చేరుకుని ఉచిత బస్సులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు సంఘటనా స్థలానికి ఏఈ పి.ప్రసాద్, రొంపిచర్ల హనుమంతాచార్యులను పంపగా వారు మల్లిపెద్దితో చర్చించారు.
 
బస్టాండ్‌ నుంచి అయితే అభ్యంతరం లేదు
స్థానిక గరుడాళ్వార్‌ సెంటర్‌ నుంచి కొండపైకి బస్సులు తిప్పడం వల్ల కొండ దిగువ వ్యాపారులు నష్టపోతున్నారన్న విషయాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు చెప్పి బస్సులను నడపడం ఆపిస్తే.. మళ్లీ ఇక్కడి నుంచి వాటిని నడపడం ఏంటని మల్లిపెద్ది ఆలయ అధికారులను ప్రశ్నించారు. ఇలా నడుపుతున్నట్టు తమకు తెలియజేయలేదన్నారు. ఉచిత బస్సులను కొత్త బస్టాండ్‌ నుంచి గాని, దేవస్థానం ఆర్చిగేటు వద్ద నుంచి గాని నడిపితే తమకెలాంటి అభ్యంతరం ఉండదన్నారు. వ్యక్తిగత కక్షలతో వ్యాపారులను ఇబ్బంది పెట్టడం తగదన్నారు. అధికారుల ఆదేశానుసారం బస్సుల్లో భక్తులను కొండపైకి చేర్చుతున్నామని, సమస్య  పునరావృతం కాకుండా చూస్తామని ఏఈ అన్నారు.
 
భక్తుల సౌకర్యార్థమే బస్సులు
దూర ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే దిశగా ఉచిత బస్సు సర్వీసులను నడుపుతున్నామని, అయితే ఇలా అడ్డుకోవడం వల్ల యాత్రికులు ఇబ్బంది పడుతున్నారని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు అన్నారు. విషయాన్ని ఆలయ చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావు దృష్టికి తీసుకెళ్లానని, ఆయన ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Advertisement
Advertisement