బావి వద్దే బట్టలుతుకుతుండటంతో అపారిశుద్ధ్యం
ఆ పల్లెలో అంతా జ్వరపీడితులే... ప్రతి ఇంటా బాధితులున్నారు. కొన్నిళ్లల్లో ఇద్దరేసీ ఉన్నారు. పల్లెలో అపారిశుద్ధ్యం తాండవిస్తుండటం... కలుషిత తాగునీటిని సేవించడం... స్థానికంగా కనీసం అవగాహన లేకపోవడం... వెరశి ఈ జ్వరాలకు కారణమని తెలుస్తోంది. వైద్యసేవలందిస్తున్నా... అక్కడ పరిస్థితి అంతగా కుదుటపడటం లేదంటే... స్థానికుల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది.
ప్రతి ఇంటిలో ఒకరు, ఇద్దరు జ్వర పీడితులే
అపారిశుద్ధ్యం, నీటికలుషితమే కారణమంటున్న గ్రామస్తులు
వైద్యసేవలందుతున్నా... కానరాని తగ్గుముఖం
మెంటాడ: ఆ పల్లెలో అంతా జ్వరపీడితులే... ప్రతి ఇంటా బాధితులున్నారు. కొన్నిళ్లల్లో ఇద్దరేసీ ఉన్నారు. పల్లెలో అపారిశుద్ధ్యం తాండవిస్తుండటం... కలుషిత తాగునీటిని సేవించడం... స్థానికంగా కనీసం అవగాహన లేకపోవడం... వెరశి ఈ జ్వరాలకు కారణమని తెలుస్తోంది. వైద్యసేవలందిస్తున్నా... అక్కడ పరిస్థితి అంతగా కుదుటపడటం లేదంటే... స్థానికుల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఇదీ చింతలవలస దుస్థితి. మండలంలోని చింతలవలస గ్రామానికి జ్వరం వచ్చింది. ఇంటికి ఒకరో, ఇద్దరో జ్వర పీడితులు కనిపిస్తున్నారు. గ్రామంలో వాడుక నీరు, వర్షపు నీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండడం, పలువురు గ్రామస్తులు చెత్తా, చెదారాన్ని బహిరంగ ప్రదేశాల్లో వేయడం, గ్రామంలో ఉన్న బావి, మంచినీటి కుళాయి వద్ద బట్టలు ఉతకడం, అదే నీటిని గ్రామస్తులు తాగడం వల్ల జ్వరాలు వస్తున్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంత చెప్పినా కొందరు మహిళలు కుళాయి వద్ద బట్టలుతకడం, పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం జ్వరాలకు కారణమవుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
నాలుగోవంతు జ్వరాలే...
గ్రామ జనాభా 535 కాగా ఇందులో నాలుగో వంతు గ్రామంలో జ్వరాలతో ఉన్నట్లు తెలుస్తోంది. పిన్నింటి సింహాచలం, బగ్గాం లక్ష్మి, బగ్గాం రత్నం, బొద్దల ఈశ్వరరావు, పిన్నింటి రామూర్తి, బవిరెడ్ది ప్రశాంత్, పిన్నింటి అప్పలనాయుడు, పిన్నింటి ఎల్లమ్మ, కలిశెట్టి సూర్యనారాయణ, బవిరెడ్డి కష్ణ, రౌతు సతీష్, బొద్దల హర్షిత, మహంతి కమలమ్మ, మహంతి దీపిక, మహంతి తిరుపతమ్మ, మహంతి సత్యం, పిన్నింటి అప్పలనాయుడు, పిన్నింటి వరుణ్ సందీప్, పిన్నింటి అశ్రితతో పలువురు గ్రామస్తులు జ్వరాలతో బాదపడు తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మరికొంత మంది జ్వరపీడితులు గజపతినగరం, విజయనగరం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తలనొప్పి, కాళ్లు చేతులు పీకులతో బాధ పడుతున్నట్లు రోగులు తెలిపారు. వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలు అందిస్తున్నప్పటికీ జ్వరాలు తగ్గుముఖం పట్టడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు.