సగానికి చేరిన సాగు | Farmers' liabilities for investment are not lending banks | Sakshi
Sakshi News home page

సగానికి చేరిన సాగు

Jul 1 2017 4:08 AM | Updated on Oct 1 2018 2:27 PM

సగానికి చేరిన సాగు - Sakshi

సగానికి చేరిన సాగు

జిల్లాలో ఖరీఫ్‌ సాగు ఊపందుకుంది. వారం రోజుల క్రితం 21,586 హెక్టార్లలో (7 శాతం మాత్రమే)పంటలు సాగు కాగా, ప్రస్తుతం 50 శాతానికి చేరింది.

ఇప్పటి వరకు 50 శాతం పంటల సాగు
పెట్టుబడుల కోసం రైతుల అవస్థలు
రుణాలు ఇవ్వని బ్యాంకులు
వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న కర్షకులు  

నల్లగొండ అగ్రికల్చర్‌ : జిల్లాలో ఖరీఫ్‌ సాగు ఊపందుకుంది. వారం రోజుల క్రితం 21,586 హెక్టార్లలో (7 శాతం మాత్రమే)పంటలు సాగు కాగా, ప్రస్తుతం 50 శాతానికి చేరింది. అంటే 1,72,098 హెక్టార్లలో వివిధ పంటలు సా«గు చేశారు. అందులో అగ్రభాగంగా 1,58,113 హెక్టార్లలో పత్తి వేశారు.

రుతుపవనాల ప్రభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా మూడు, నాలుగు రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దుక్కులు దున్నుకుని సిద్ధంగా ఉంచుకున్న రైతులు పత్తి విత్తనాలను విత్తుకునే పనిలో నిమగ్నమయ్యారు. అదేవిధంగా నాన్‌ఆయకట్టు ప్రాంతంలో బోరుబావుల కింద ఇప్పటికే అనేక ప్రాంతాలలో వరినార్లు పోసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే రైతులు వరినార్లు పోసుకునే పనిలో ఉన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 3,19,625 హెక్టార్లు కాగా సుమారు 3,50,000 హెక్టార్లలో వివిధ పంటలను రైతులు సాగు చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,72,098 హెక్టార్లలో సాగు చేశారు. ఇందులో వరి 198 హెక్టార్లలో వరినార్లు పోసుకోగా పత్తిని 1,58,113 హెక్టార్లలో సాగు చేశారు. అంటే పత్తి అంచనాలో 50 శాతం మేర సాగుకు నోచుకుంది. వర్షాలు ఇలానే కొనసాగితే జూలై రెండోవారంలోపు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సాగును పూర్తి చేసే అవకాశం ఉంది..

బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు
ఖరీఫ్‌ సాగు ఊపందుకోవడంతో అన్నదాతలు పెట్టుబడుల కోసం అవస్థలు పడుతున్నారు. దుక్కులు దున్నకం, విత్తనాల, ఎరువు కొనుగోలు, కూలీల ఖర్చులు ఎకరానికి పత్తికి సుమారు రూ.10 వేల వరకు పెట్టుబడులను పెట్టాల్సిన అవసరం ఉంది. దీంతో రైతులు బ్యాంకుల చుట్టూ పంట రుణాల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 3 లక్షల మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రుణాలు పొంది ఉన్నారు. అయితే నాలుగో విడత రుణమాఫీని ప్రభుత్వం గత నెలలో విడుదల చేసినా ఇప్పటి వరకు 90 శాతం మంది రైతుల ఖాతాల్లో   డబ్బులను జమజేశారు.

అయినప్పటికీ బ్యాంకులు రైతులకు డబ్బులు ఇవ్వడానికి విముఖతను చూపుతున్నాయని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఖరీఫ్‌ రుణాలను రూ.1,400ల కోట్లు ఇవ్వాలని జిల్లా బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసింది. అయినా బ్యాంకులు రైతులకు రుణాలను ఇవ్వకుండా రేపురా..మాపురా అని తిప్పుకుంటున్నారే తప్ప అప్పులు ఇవ్వని పరిస్థితి. ఇప్పటి వరకు కేవలం రూ.330ల కోట్లు మాత్రమే రెన్యూవల్‌తో పాటు కొన్ని కొత్త రుణాలను ఇచ్చినట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.

కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌
కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ఉప్పల్‌ పది రోజుల క్రితం బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో రుణం కోసం వచ్చిన ప్రతి రైతుకూ పంటరుణాలను ఇవ్వాలని, రైతుల పట్ల చిన్నచూపుతగదని ఆదేశాలను జారీ చేశారు. కానీ ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమై ఇరవై రోజులు గడుస్తున్నా ఇప్పటికీ బ్యాంకు అధికారులు స్పందించడం లేదు. సీజన్‌ వచ్చి నెత్తిన కూర్చోవడంతో రైతులు పెట్టుబడుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
బ్యాంకులు రుణాలను ఇవ్వడానికి విముఖత చూపకపోవడంతో రైతులు పెడ్డుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా తీసుకుని వ్యాపారులు అధిక వడ్డీలతో రుణాలను ఇస్తున్నారు. విత్తనాలను, ఎరువులను, దున్నకాల కోసం ఉద్దెర పెట్టి ఎక్కువ వడ్డీలను వసూళ్లు చేసుకునే పనిలో వ్యాపారులు ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా అ«ధికారులు స్పందించి బ్యాంకుల నుంచి పంట రుణాలను ఇప్పించాలని రైతులు కోరుతున్నారు.  
పంటల                             సాగు ఇలా..            (హెక్టార్లలో)
పంట పేరు                           అంచనా                 సాగైంది
వరి                                    57567               198 వరినార్లు
జొన్న                                       644              152
సజ్జ                                          728                75
మొక్కజొన్న                                211                15
కంది                                       10381            1239
పెసర                                        2798               359
వేరుశనగ                                  1028               137
ఆముదం                                     977                  5
పత్తి                                       213695        158113
మిర్చి                                          2262                8
మొత్తం                                  3,19,625        1,72,098.


రుణాలను ఇవ్వకపోతే మా దృష్టికి తీసుకురావాలి..
బ్యాంకులు రైతులకు పంట రుణాలను ఇవ్వాలని కచ్చితమైన ఆదేశాలను కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఆదేశాలను జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా పంటరుణాలను ఇవ్వాల్సిందేనని చెప్పారు. బ్యాంకులు రుణాలను ఇవ్వకపొతే తమ దృష్టికి తీసుకురావాలని జిల్లా వ్యవసాయాధికారి బి.నర్సింహారావు, ఎల్‌డీఎం సూర్యం తెలిపారు. ఎక్కడైనా ఇబ్బందులు గురిచేస్తే తమ ఫోన్‌లకు జేడీఏ సెల్‌ 7288894477, ఎల్‌డీఎం సెల్‌ 9440186963 తెలియజేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement