నకిలీ విత్తనాలతో భారీ నష్టం | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలతో భారీ నష్టం

Published Fri, Sep 30 2016 10:55 PM

నకిలీ విత్తనాలతో భారీ నష్టం

 

కొరిటెపాడు(గుంటూరు) :  మిరప కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగబోయిన రంగారావు డిమాండ్‌ చేశారు. నకిలీ కల్తీ విత్తనాల వల్ల మిరప పంట నష్టపోయిన మేడికొండూరు, అమరావతి మండలాల రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వి.డి.వి.కపాదాసును కలసి వినతి పత్రం అందజేశారు. రంగారావు మాట్లాడుతూ నకిలీ విరప విత్తనాల వల్ల రైతులు భారీ ఎత్తున నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులు ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు క్యాంపు కార్యాలయాలకు కూత వేటు దూరంలో నకిలీ విత్తనాలు విచ్చల విడిగా అమ్మకాలు జరగడం దుర్మార్గమన్నారు. నష్టపరిహారం చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడ్తామని హెచ్చరించారు. జేడీఏ కపాదాసు మాట్లాడుతూ ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు, అధికారులు, రైతు ప్రతినిధులు, కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదులు వచ్చిన గ్రామాల్లో పర్యటిస్తున్నారని, నివేదిక రాగానే విత్తన చట్టం ప్రకారం నకిలీ విత్తన వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జేడీఏను కలసిన వారిలో కౌలు రైతు సంఘం నాయకులు కె.అజయ్‌కుమార్, బైరగాని శ్రీనివాసరావు, అమరావతి, మేడికొండూరు మండలాల రైతులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement