బెదిరించి దోచేయడమే

బెదిరించి దోచేయడమే


ఆగని నకిలీ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ లీలలు 

మూడు జిల్లాల్లో అనధికార తనిఖీలు  

ఇప్పటికే పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు  

ముఠాగా ఏర్పడి అక్రమ వసూళ్లు
మర్రిపాలెం : కనిపించిన వాహనాన్ని ఆపడం.. పత్రాలు చూపించండి.. కారులో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉన్నారు అని బెదిరించడం.. ఆనక ఓ రేటు మాట్లాడుకుని దోచుకోవడం.. ఇలా సాగిపోతోంది ఓ ప్రబుద్ధుడి నిర్వాకం. పలుమార్లు పోలీసులకు చిక్కినా.. కేసులు నమోదు చేసినా అతని ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఏకంగా ఓ ముఠా తయారుచేసి తనిఖీల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మూడు రోజుల కిందట విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో తనఖీలు చేపడుతూ ముఠా సభ్యులు పోలీసులకు చిక్కారు. ప్రధాన నిందితుడు మాత్రం తప్పించుకున్నాడు. అతని కోసం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

 

పగలు డ్రైవింగ్‌... రాత్రుళ్లు తనిఖీలు  

ఇసుకతోట ప్రాంతానికి చెందిన గోవింద్‌ ఒకప్పుడు మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కారుకు డ్రైవర్‌గా పనిచేశాడు. సదరు అధికారి కారును తన ఇంటి వద్ద ఉంచుతానని చెప్పి తీసుకుపోయేవాడు. రాత్రి వేళ ఆ కారుతో రహదారులపై తనిఖీలకు తెరలేపాడు. ‘రవాణా శాఖ’ పేరుతో కారు చూసిన వారంతా నిజమని నమ్మేవారు. కారులో ఓ మహిళను ఉంచి మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ అని నమ్మిస్తూ ఎడాపెడా దోచేసేవాడు. ఉదయం మరలా యధావిధిగా విధులకు వచ్చేవాడు. తనిఖీల విషయం సదరు అధికారికి తెలియడంతో ఉద్యోగం ఊడింది. మరో అధికారి వద్ద గోవింద్‌ మళ్లీ డ్రైవర్‌గా చేరాడు. అక్కడ కూడా అదే తరహాలో వ్యవహరించడంతో ఉద్యోగం పోయింది. ఇదంతా రెండేళ్ల క్రితం మాట.  గోవింద్‌ కోసం గాలింపు

నకిలీ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా చెలామణీ అవుతోన్న గోవింద్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గోవింద్‌ పట్టుబడితే మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా విశాఖలో పలువురు అధికారుల వద్ద పనిచేసిన గోవింద్‌ తనదైన శైలిలో బెదిరింపులకు పాల్పడేవాడని తెలిసింది. అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేయడంలో దిట్టగా చెబుతున్నారు. నమ్మకంగా ఉంటూ తన అసలు రూపం చూపేవాడని సమాచారం. అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం చెబుతానని బెదిరించి డబ్బులు దోచుకోవడంలో దిట్టగా రవాణా శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే లక్షలాది రూపాయలు దోచిన గోవింద్‌ ఆగడాలకు పోలీసులు చెక్‌ పెట్టాలని, మరోసారి నకిలీ అధికారిగా కనిపించకుండా కఠినంగా శిక్షించాలని రవాణా శాఖ అధికారులు కోరుతున్నారు.    సొంతంగా కారు... ఓ ముఠా  

అప్పటికే దోచుకున్న డబ్బుతో గోవింద్‌ సొంతంగా కారు కొన్నాడు. ఏకంగా ఓ ముఠా తయారుచేశాడు. రోడ్డు మీద కాపు గాచి తనిఖీలకు ఉపక్రమించాడు. లారీలు ఆపి రికార్డులు తనిఖీ చేయడం, కేసులు నమోదు చేస్తానని బెదిరించి డబ్బులు గుంజేవాడు. అయితే ఆయా ప్రాంతాల్లో గోవింద్‌ ఆగడాలను పోలీసులు పసిగట్టారు. విజయనగరం జిల్లాలోని ఆయా పోలీస్‌స్టేషన్‌లలో అరెస్ట్‌ చేసి కేసులు నమోదు చేశారు. మూడు నెలల క్రితం చోడవరం ప్రాంతం చీడికాడలో తనిఖీలు జరిపి మరలా దొరికిపోయాడు. గోవింద్‌తో పాటు మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా నమ్మించిన మహిళను, మరో ఇద్దరిని చోడవరం పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. నెల రోజుల తర్వాత బెయిల్‌ మీద విడుదలైన గోవింద్‌ ప్రవర్తనలో మార్పు రాలేదు. మరలా తనిఖీలు ప్రారంభించాడు. మూడు రోజుల క్రితం భోగాపురం ప్రాంతం సుందరపేటలో ఓ లారీ డ్రైవర్‌ను బెదిరించాడు. తాను మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా తెలిపి రూ.25 వేలు డిమాండ్‌ చేశాడు. అంత ఇచ్చుకోలేనని డ్రైవర్‌ చెప్పడంతో రూ.3 వేలకు బేరం కుదిరింది. అయితే డ్రైవర్‌ అనుమానంతో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భోగాపురం సీఐ నర్సింహరావు నేతృత్వంలో కారు అదుపులోకి తీసుకున్నారు. అందులోని ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా గోవింద్‌ తృటిలో తప్పించుకున్నాడు. లారీ డ్రైవర్‌ వద్ద డబ్బు వసూలు విషయం వాస్తవమని పోలీసులు తేల్చారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top