మాజీ మంత్రి జీవీ శేషు ఇకలేరు

మాజీ మంత్రి జీవీ శేషు పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్న వైఎస్సార్ సీపీ నేత బాలినేని


ఒంగోలు సబర్బన్‌/ ఒంగోలు అర్బన్‌: మాజీ మంత్రి గుర్రాల వెంకట శేషు (జీవీ శేషు) (71) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం వేకువ జామున తన స్వగృహంలో నిద్రలోనే కన్నుమూశారు. ఆయన నాలుగు రోజుల పాటు నగరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొంది శుక్రవారం సాయంత్రమే డిచ్చార్జ్‌ అయ్యారు. ఇంటికి వచ్చిన ఆయన ఆ రాత్రి నిద్రలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. శేషు కుటుంబం, బంధువులు, అభిమానులు దు:ఖసాగరంలో మునిగిపోయారు. క్లౌపేట మొదటి లైన్‌లోని ఆయన నివాసంలో భౌతిక కాయాన్ని ఉంచారు.


 


మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చి శేషు భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాలినేని మాట్లాడుతూ శేషు ఎటవంటి ఆర్భాటాలు లేకుండా రాజకీయ జీవితంలో పేద బడుగు బలహీన వర్గాలకు సేవలందించారని కొనియాడారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండే సీనియర్‌ రాజకీయ వేత్త.. అని అన్నారు. బాలినేనితో పాటు వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు డీఎస్‌ క్రాంతికుమార్, నగర మహిళ అధ్యక్షురాలు కావూరి సుశీల, ఇతర నాయకులు శింగరాజు వెంకట్రావు, నత్తల భీమేష్, దేవరపల్లి అంజిరెడ్డి, అక్కిరెడ్డి, తోటపల్లి సోమశేఖర్, స్వరూప్‌ ఉన్నారు.


 

విద్యావంతుడు కూడా..

శేషు స్వగ్రామం టంగుటూరు మండలం జమ్ములపాలెం. తన ప్రాథమిక విద్యను ఒంగోలులోనే పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్శిటీలో మాస్టర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఎంకామ్‌) విద్యనభ్యసించారు. అనంతరం స్థానిక ఏబీఎం కాళాశాల ఎదుట ట్యుటోరియల్‌ కళాశాల స్థాపించారు. ఇంగ్లిష్‌ గ్రామర్‌ను వేలాది మంది విద్యార్థులకు నేర్పించారు. ఎందరో యువకుల ఉన్నతికి దోహద పడ్డారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన రాజకీయ వారసునిగా కుమారుడు డాక్టర్‌ రాజ్‌విమల్‌ ఉన్నారు.

 

శేషు పేదల పక్షపాతి : ఎంపీ వైవీ

దివంగత జీవీ శేషు పేదల పక్షపాతని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శేషు మరణం తనను ద్రిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. శేషు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధ్యాపకునిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చి మంత్రి స్థాయికి ఎదిగిన నేత శేషు.. అని ఎంపీ కొనియాడారు.

పలువురు నేతల నివాళులు 


శేషు భౌతిక కాయానికి పలువురు నేతలు నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి, కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా బాలవీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, కాంగ్రెస్, టీడీపీ, వివిధ దళిత, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.  

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top