
ఉల్లాసంగా క్రికెట్ పోటీలు
క్రీడలు ఆడడం ద్వారా మానిసిక ఉల్లాసం కలుగుతుందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వెంకటశివారెడ్డి పేర్కొన్నారు.
కడప స్పోర్ట్స్: క్రీడలు ఆడడం ద్వారా మానిసిక ఉల్లాసం కలుగుతుందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వెంకటశివారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి- ఏసీఏ క్రికెట్ మైదానంలో విద్యుత్ ఉద్యోగుల ఇంటర్ సర్కిల్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని సూచించారు. పని ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులు పోటీల్లో పాల్గొనడం సంతోషకరమైన విషయమన్నారు. జిల్లాలో ఎంతో ఆకర్షణీయమైన చక్కటి టర్ఫ్ వికెట్లతో కూడిన క్రికెట్ మైదానాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, అంకిత భావంతో ఆడాలని సూచించారు.
క్రీడలతో ఉద్యోగుల్లో పునరుత్తేజం
ఏపీఎస్పీడీసీఎల్ డివిజినల్ ఇంజినీర్ (టెక్నికల్) శోభా వాలెంటీనా మాట్లాడుతూ విధి నిర్వహణలో విద్యుత్ ఉద్యోగులు చాలా ఒత్తిడి ఎదుర్కొంటుంటారని, ఇలాంటి పోటీల ద్వారా వారిలో పునరుత్తేజం కలుగుతుందని తెలిపారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రామ్మూర్తి మాట్లాడుతూ ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఈ పోటీల్లో వివిధ సర్కిల్స్‌కు చెందిన 24 జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ డీఈ (ఎంఅండ్‌టీ) బ్రహ్మానందరెడ్డి, విద్యుత్‌శాఖ ఏడీఈ చాన్‌బాషా, ఏఈ శ్రీధర్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి వై.శివప్రసాద్, ఉద్యోగులు పాల్గొన్నారు.