పరిశీలిస్తూ.. ప్రశ్నిస్తూ..

పరిశీలిస్తూ.. ప్రశ్నిస్తూ.. - Sakshi

కోనసీమలో పలు ప్రాంతాల్లో కలెక్టర్‌ మిశ్రా సుడిగాలి పర్యటన 

ఉరుకులు, పరుగులు పెట్టిన అధికారులు

సఖినేటిపల్లి : జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా బుధవారం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. దీంతో ఆయన వెంట వివిధ శాఖల అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. పలు  అభివృద్ధి పనులను పరిశీలిస్తూ.. రైతులకు, ప్రజలకు అవసర మయ్యే పనులు గుర్తిస్తూ కలెక్టర్‌ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.  అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహస్వామివారి దర్శనానికి వచ్చిన కలెక్టర్‌ మండలంలోని దేవస్థానం, పల్లిపాలెం, సఖినేటిపల్లి, అంతర్వేదిపాలెం, మోరి ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత అంతర్వేది గెస్ట్‌హౌస్‌ నుంచి కలెక్టర్‌ సరాసరి దేవస్థానంలోని సముద్ర స్నానాల రేవును పరిశీలించారు. స్నానాలరేవు పరిసరాల్లో పారిశుద్ధ్యం సక్రమంగా లేదంటూ స్థానిక భక్తులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణం దీనిపై దృష్టి పెట్టాలని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. అక్కడి నుంచి లైట్‌హౌస్‌ మీదుగా సాగరసంగమం ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం సుమారు రూ.23 కోట్లతో జరుగుతున్న ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. హార్బర్‌లో జరుగుతున్న పనులను హెడ్‌వర్క్స్‌ ఈఈ కృష్ణారావు, కలెక్టర్‌కు వివరించారు. తొలి ఫేజ్‌ పనులు ఎప్పటికి పూర్తిచేస్తారని కలెక్టర్‌ ప్రశ్నించగా ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని ఈఈ కృష్ణారావు బదులు చెప్పారు. అనంతరం అంతర్వేది ఏటిగట్టుకు రాళ్ల, నవా మురుగుకాలువలకున్న శిథిల అవుట్‌ఫాల్‌ స్లూయిస్‌లను, నీరు–చెట్టు పథకంలో వివిధ పంటకాలువల్లో జరుగుతున్న రక్షణగోడ నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. సఖినేటిపల్లి, అంతర్వేదిపాలెం, మోరి గ్రామాల పరిధిల్లోని ఆయా పనులను చూశారు. 

అండర్‌టన్నెల్‌ నిర్మించాలని..

కాలువమొగ సెంటర్‌ నుంచి పల్లిపాలెం వరకూ తవ్విన మురుగుకాలువకు అంతర్వేది దేవస్థానం పరిధిలో ఆదర్శనగర్‌ వద్ద అండర్‌టన్నెల్‌ నిర్మించాలని, ఇది లేకపోవడం వల్ల మురుగుకాలువలోకి ఉప్పునీరు పోటెత్తే అవకాశం ఉందని కలెక్టర్‌కు, స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు రావి దుర్గ ఆలేంద్రమణి వివరించారు. దీనిని పరిశీలించాల్సిందిగా ఆర్డీఓ గణేష్‌కుమార్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.

గోదావరి డెల్టాకమిటీ చైర్మన్‌ భూపతిరాజు ఈశ్వరరాజువర్మ, రాజోలు సబ్‌డివిజన్‌ నీటి సంఘ ఛైర్మన్‌ ఓగూరి విజయ్‌కుమార్, ఎంపీపీ పప్పుల లక్ష్మీసరస్వతి, సర్పంచ్‌లు చొప్పల చిట్టిబాబు, భాస్కర్ల గణపతి, పోతురాజు నాగేంద్రకుమార్, ఎంపీటీసీ సభ్యులు దొంగ నాగసత్యనారాయణ, జి వాసు, తహసీల్దార్‌ డీజే సుధాకర్‌రాజు, ఎంపీడీఓ జీ వరప్రసాద్‌బాబు, ఈఓపీఆర్డీ బొంతు శ్రీహరి, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జేఈ సునీల్, రాజోలు ఏఎంసీ చైర్మన్‌ కాండ్రేగుల సత్యనారాయణమూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి కృష్ణారావు, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు. 

పర్యాకుల విడిది కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ మిశ్రా


పాశర్లపూడి(మామిడికుదురు) : పాశర్లపూడిబాడవలో రూ.1.13 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పర్యాటకుల విడిది కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా బుధవారం పరిశీలించారు. పర్యాటకులు వైనతేయ గోదావరి నదిలో విహరించిన అనంతరం ఇక్కడ విశ్రాంతి తీసుకునేలా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రత్యేకాధికారి భీమశంకరం కలెక్టర్‌కు వివరించారు. ఈ కేంద్రానికి సమీపంలో ఉన్న అప్పనపల్లి శ్రీబాలబాలాజీ స్వామి వారి దేవస్థానంతో పాటు ఆదుర్రులోని ప్రాచీన ఆది బౌద్ధ స్థూపాన్ని బోటు షికారు ద్వారా సందర్శించే పర్యాటకుల విడిది కోసం ఈ కేంద్రం నిర్మిస్తున్నామన్నారు. ఈ కేంద్రానికి కనకదుర్గమ్మ ఆలయం పక్కన ఉన్న మెటల్‌ రోడ్డును సిమెంట్‌ కాంక్రీట్‌ రోడ్డుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. మరో వైపున సీసీ రోడ్డు నిర్మాణానికి జిరాయితీ రైతుల నుంచి భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. ఇక్కడ జరుగుతున్న పనులను కలెక్టర్‌ పరిశీలించి టూరిజం అధికారులకు పలు సూచనలు అందించారు. ఆయన వెంట అమలాపురం ఆర్డీఓ జి.గణేష్‌కుమార్, టూరిజం, రెవెన్యూ శాఖ అధికారులు ఉన్నారు.   


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top