‘దీపం’ బాధ్యతలు తహసీల్దార్లకు..

‘దీపం’ బాధ్యతలు తహసీల్దార్లకు.. - Sakshi


లబ్దిదారుల ఎంపిక చేయాల్సింది వీరే..

ఎంపీడీవోలను తప్పించిన సర్కార్‌

జాప్యం, అనర్హుల నివారణకే ఈ నిర్ణయం

దరఖాస్తుల స్వీకరణ మొదలు

మహిళలకు తప్పనున్న కట్టెలపొయ్యి కష్టాలు




నిర్మల్‌రూరల్‌: కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్న మహిళల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం దీపం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆహార భద్రత కార్డులు కలిగిన కుటుంబాల్లోని మహిళల పేరుమీద ఈ పథకం కింద రాయితీ వంటగ్యాస్‌ కనెక్షన్లను మంజూరు చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు చేసేవారు. కానీ ఇక నుంచి వీరుని తప్పిస్తూ ఆయా మండలాల తహసీల్దార్లకు ఎంపిక బాధ్యతను ప్రభుత్వం అప్పజెప్పింది.



ఎంపికలో జాప్యం వల్లే..

దీపం పథకం అనగానే స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఉండేవి. అంతేకాకుండా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో, పట్టణ ప్రాంతం వరకు మున్సిపల్‌ కార్యాలయంలో కొత్త కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకునేవారు. ఆ దరఖాస్తులను స్థానిక పంచాయతీ కార్యదర్శులు విచారించి, అర్హుల జాబితాను ఎంపీడీవోలు, మున్సిప ల్‌ కమిషనర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖకు పంపించేవారు. అక్కడి నుంచి కలెక్టర్‌కు చేరి, సంబంధిత జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం పొందాల్సి ఉండేది. ఈ తతంగం అంతా పూర్తయ్యే సరికి చాలా జాప్యం జరిగేది. ఈ సమస్యను నివారించేందుకు తహసీల్దార్లకు దరఖాస్తు చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.



తహసీల్దార్లకు బాధ్యతలు

దీపం పథకం కింద దరఖాస్తు చేసుకునే వారు ఇక నుంచి తమకు సంబంధించిన తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన వాటిని తహసీల్దార్‌ ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తారు. వారి ఆధార్‌ నంబర్, కుటుంబంలో గ్యాస్‌ కనెక్షన్‌ ఉందా...? లేదా..? ఉంటే ఎవరి పేరుపైన ఉంది. ప్రైవేట్‌ కనెక్షన్‌ లేదా దీపం కనెక్షన్‌ వంటి వివరాలు పరిశీలిస్తారు. క్షేత్రస్థాయిలో తమ సిబ్బందిని కూడా పంపి పరిశీలించే అవకాశం ఉంది. దరఖాస్తుదారు అర్హుడని నిర్ణయించుకున్న తరువాత వారిని ఎంపిక చేస్తారు. గ్రామసభల్లో వివరాలు చదివి వినిపించి తీర్మానం చేసి జాబితాను రూపొందిస్తున్నారు. అనంతరం జాబితాను పౌరసరఫరాల శాఖకు పంపిస్తారు. అక్కడి నుంచి జిల్లా కలెక్టర్‌కు చేరుతుంది. అతని ఆమోదంతో లబ్ధిదారులకు సిలిండర్‌ను మంజూరు చేస్తారు.



జిల్లాలో ఇదీ పరిస్థితి...

జిల్లా కేంద్రంతో పాటు భైంసా, ఖానాపూర్‌ పట్టణాల్లో ఐదు గ్యాస్‌ కనెక్షన్ల ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సుమారు లక్షా 10 వేల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 25 వేల వరకు దీపంవి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ సీజన్‌లో 17 వేల దీపం కనెక్షన్లు మంజూరయ్యాయి. జిల్లాలోని ఆయా మండలాల్లో తహసీల్దార్‌ కార్యాలయాల్లో దీపం కనెక్షన్ల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.



ఇలా దరఖాస్తు చేసుకోవాలి

దీపం పథకం కింద గ్యాస్‌ కనెక్షన్‌ కోరేవారు ఆయా మండలాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్‌ కార్డు, ఆహార భద్రత కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌ పత్రాలు, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు దరఖాస్తుతో జత చేయాలి. అర్హులను తహసీల్దార్‌ ఎంపిక చేసి ఉన్నతాధికారులకు పంపిస్తారు.



కిరోసిన్‌ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాను కిరోసిన్‌ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. ఇందుకోసం అర్హులైన పేద లబ్ధిదారులందరికీ దీపం పథకం కింద వంట గ్యాస్‌ కనెక్షన్లను మంజూరు చేస్తాం. ఇప్పటికే 7వేల కనెక్షన్లను మూడు నెలల క్రితం అందించాం. మరో 10 రోజుల్లో జిల్లావ్యాప్తంగా 10 వేల మంది దీపం పథకం సిలిండర్లను అందించేందుకు కార్యాచరణ రూపొందించాం.

– సుదర్శన్, జిల్లా పౌరసరఫరాల అధికారి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top