అశ్రు నయనాలతో అంతిమ యాత్ర | Dead bodies reached own places tamilnadu accident case | Sakshi
Sakshi News home page

అశ్రు నయనాలతో అంతిమ యాత్ర

Sep 18 2017 9:49 AM | Updated on Apr 3 2019 7:53 PM

మృతదేహాలతో కొల్లూరుకు చేరిన అంబులెన్సులు , - Sakshi

మృతదేహాలతో కొల్లూరుకు చేరిన అంబులెన్సులు ,

తీర్థయాత్రలో అసువులుబాసిన మృతుల అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య జరిగింది.

స్వస్థలాలకు  చేరిన మృతదేహాలు

తీర్థయాత్రల కోసం వెళ్లి తమిళనాడులో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురి మృతదేహాలు ఆదివారం జిల్లాకు చేరుకున్నాయి. తమవారి మృతదేహాలను చూడగానే కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.


కొల్లూరు :   తీర్థయాత్రలో అసువులుబాసిన మృతుల అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య జరిగింది. తెనాలి పట్టణ, పరిసర గ్రామాలు, గుంటూరు నగరానికి చెందిన సుమారు 42 మంది ఈ నెల 13వ తేదీ కన్యాకుమారి వరకు తీర్థయాత్రకు వెళ్లడం, తిరునల్వేలి సమీపంలో ఆగి ఉన్న వీరి బస్సును వెనుక ఉంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.   మృతదేహాలు ఆదివారం సాయంత్రం స్వస్థలాలకు చేరుకున్నాయి. కొల్లూరు మండలంలోని అనంతవరం, ఈపూరు గ్రామాలకు చెందిన నాగవర్ధిని (43), కన్నెగంటి రామయ్య (63), దేశు వెంకటరామారావు (65) మృతదేహాలను తమిళనాడు నుంచి అధికారులు తీసుకొచ్చారు.

అపశ్రుతితో జాప్యం
మృతదేహాలు అంబులెన్స్‌ల్లో శనివారం రాత్రే బయలుదేరాయి. ఆదివారం మధ్యాహ్నానికే చేరుకోవాల్సి ఉంది. అయితే ఓ అంబులెన్స్‌ 30 కిలోమీటర్ల వచ్చిన తర్వాత తమిళనాడుకు చెందిన ఓ వృద్ధుడ్ని ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీసులు డ్రైవర్, అంబులెన్స్‌ను అదుపులోకి తీసుకొని మరో అంబులెన్స్‌ను సమకూర్చిపంపారు. దీంతో జాప్యం చోటుచేసుకుంది. ప్రత్యేక బస్సులో క్షతగాత్రులు, మిగిలిన యాత్ర బృంద సభ్యులను అధికారులు స్వస్థలాల్లో దిగబెట్టారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు పరామర్శించారు.

పూర్తయిన సత్యం అంత్యక్రియలు
తెనాలిరూరల్‌ :  రోడ్డు ప్రమాద బాధితులు ఆదివారం సాయంత్రం తెనాలి చేరుకున్నారు. బాధితులను తీసుకువచ్చేందుకు, మృతదేహాలను తరలించేందుకు వెళ్లిన కొల్లూరు తహసీల్దార్, ఎస్‌ఐ ఈ బస్సులోనే బాధితులతో కలసి వచ్చారు. స్వల్ప గాయలతో క్షేమంగా తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులను చూసి బంధువులు ఉద్వేగానికి లోనయ్యారు.  

సన్నిహితులే ఆత్మబంధువులై..
ప్రమాదంలో మృతి చెందిన వంట మాస్టర్‌ సత్యం మృతదేహానికి తహసీల్దార్‌ జీవీ సుబ్బారెడ్డి, త్రీ టౌన్‌ ఎస్‌ఐ పైడి హజరత్తయ్య అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సత్యంకు సన్నిహితులైన మద్దాల జగన్నాథరావు, రమణమ్మ దంపతులు, సత్యం ఉండే ఇంటి యజమాని రాజారావు, మరికొందరు స్థానికులు అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించారు. 25 ఏళ్లుగా తెనాలిలో ఉంటున్న సత్యంతో తనకు 15 ఏళ్లుగా పరిచయం ఉందని, తన సంబంధీకుల గురించి ఎన్నిసార్లు అడిగినా, నాకు మీరున్నారు, ఏదన్నా జరిగితే మీరే అన్నీ చేయాలంటుండే వాడే మినహా ఏ వివరాలు చేప్పేవాడు కాదని జగన్నాథరావు గుర్తుచేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement