జాతీయస్థాయిలో ఉద్యమం | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయిలో ఉద్యమం

Published Sun, Sep 17 2017 10:48 PM

జాతీయస్థాయిలో ఉద్యమం

- అగ్రిగోల్డ్‌ బాధితులకు మద్దతుగా చలో ఢిల్లీ, జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపడతాం
- రాష్ట్ర ప్రభుత్వంలోని స్వార్థపర శక్తుల వల్లే సమస్య జఠిలం
- అగ్రిగోల్డ్‌ ప్రజాగర్జన సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ


అనంతపురం అర్బన్‌: అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, ‘చలో ఢిల్లీ’ ద్వారా ఈ సమస్యను జాతీయస్థాయికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంలోని స్వార్థపర శక్తులే సమస్య పరిష్కారానికి అడ్డుగా నిలుస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్ల ఒరిస్సా, కర్నాటకలోని అగ్రిగోల్డ్‌ బాధితులను కలుపుకొని జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని, చలో ఢిల్లీ చేపట్టి జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనకు దిగుతామని తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నెలరోజులపాటు చేపట్టిన చైతన్యయాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం స్థానిక ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ‘అగ్రిగోల్డ్‌ బాధితుల ప్రజాగర్జన’ సభ నిర్వహించారు. ముందుగా అగ్రిగోల్డ్‌ సంస్థ కారణంగా అసువులు బాసిన 149 మందికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

అనంతరం సభలో నారాయణ మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ సంస్థ చట్టవిరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. సంస్థ ఆస్తులను తాకట్టు పెట్టుకుని రూ.5 వేల కోట్లు ఇచ్చి చిన్నమొత్తాల ఖాతాదారులను ఆదుకోవాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. అగ్రిగోల్డ్‌ మోసం వల్ల 149 మరణించారని, ఇందుకు ప్రభుత్వాన్ని, అగ్రిగోల్డ్‌ సంస్థను బాధ్యులను చేస్తూ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంఎ.గఫూర్, ఆమ్‌ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ పోతిన వెంకటరామారావు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కార్యదర్శి సుందర రామరాజు, అగ్రిగోల్డ్‌ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు ముప్పాళ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి తిరుపతయ్య, జిల్లా అధ్యక్షుడు నారాయణప్ప, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు, ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.జె.చంద్రశేఖర్, సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement