జాతీయ జెండాను అవమానపరిచాడంటూ జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు గొల్లూరి అంజయ్యపై కాంగ్రెస్ నాయకుడు మహేశ్ మంగళవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-విచారణాంనంతరం తదుపరి చర్యలు
-అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదు
కుషాయిగూడ
జాతీయ జెండాను అవమానపరిచాడంటూ మీర్‌పేట్-హెచ్‌బీకాలనీ డివిజన్ కార్పొరేటర్, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు గొల్లూరి అంజయ్యపై చర్లపల్లి డివిజన్ కాంగ్రెస్ నాయకుడు మహేశ్ మంగళవారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల సందర్బంగా రాజీవ్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో జాతీయజెండాను ఆవిష్కరించిన ఆయన ఓ చేత్తో జెండా కర్రను పట్టుకొని జాతీయ గీతాన్ని పాడిన తీరును అవమానకరంగా ఉందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ జాతీయ జెండాను అవమానపరచడంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఘటనపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు తెలిపారు. కాగా ఈ విషయంపై గొల్లూరి అంజయ్యను వివరణ కోరగా జెండా ఎగురవేయగానే అంతా జాతీయ గీతం పాడటం మొదలుపెట్టారని, ఆ తొందరలో యాదృచ్చికంగా జరిగిందే కాని, జాతీయ జెండాను అవమానపరిచే సంస్కారహీనులం కామన్నారు. జెండాను చేత్తో పట్టుకోవడం కూడ అవమానపరచడమే అవుతుందాని ఆయన ప్రశ్నించారు. నిరంతరం అంబేద్కర్ ఆశయ సాధన కోసం పాటుపడే మాలాంటి వారిపై బురదజల్లేందుకు అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు. మమ్మల్ని అగౌరవ పరిచిన వారిపై మేము కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.