మాట వినకుంటే.. ‘దండు’యాత్రే! | chandradandu prakash dominates on officers | Sakshi
Sakshi News home page

మాట వినకుంటే.. ‘దండు’యాత్రే!

Mar 28 2017 12:04 AM | Updated on Sep 5 2017 7:14 AM

మాట వినకుంటే.. ‘దండు’యాత్రే!

మాట వినకుంటే.. ‘దండు’యాత్రే!

అనంతపురంలో ‘చంద్రదండు’ నాయకులు చెలరేగిపోతున్నారు. అసలే ‘అధినేత’ పేరుతో పుట్టుకొచ్చిన ‘దండు’. ఆపై అధికార అండా ఎటూ ఉంది. ఇక తమకు అడ్డెవరన్న ధోరణితో రెచ్చిపోతున్నారు.

- రెచ్చిపోతున్న ‘చంద్రదండు’
- అధికారులపై తరచూ దౌర్జన్యాలు


అనంతపురం న్యూసిటీ : అనంతపురంలో ‘చంద్రదండు’ నాయకులు చెలరేగిపోతున్నారు. అసలే ‘అధినేత’ పేరుతో పుట్టుకొచ్చిన ‘దండు’. ఆపై అధికార అండా ఎటూ ఉంది. ఇక తమకు అడ్డెవరన్న ధోరణితో రెచ్చిపోతున్నారు. అధికారులంటే లెక్కే లేదు. తాము చెప్పినట్లు వినకపోతే కొట్టడానికీ వెనుకాడరు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని సీఎం చంద్రబాబు తరచూ వల్లె వేస్తుంటారు. కానీ ఆ పార్టీ నేతలు మాత్రం అందుకు భిన్నంగా వెళ్తుంటారు. చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్‌ నాయుడు తాను చెప్పినట్టు వినకపోతే ఎంతటి స్థాయి అధికారినైనా, ప్రజాప్రతినిధిని అయినా బండబూతులు తిడుతుంటాడు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అతని దౌర్జన్యాలు నగర పాలక సంస్థలో పెరిగిపోయాయి.  అతని తీరుతో అధికారులు, చివరకు సొంత పార్టీ నేతల బెంబేలెత్తిపోతున్నారు.

కమిషనర్‌పై ఆగ్రహం
    - బిల్లులు చెల్లించాలంటూ  ప్రకాష్‌నాయుడు సోమవారం తన అనుచరులు, కాంట్రాక్టర్లతో కలిసి  నగరపాలక సంస్థ కార్యాలయంలో హల్‌చల్‌ చేశారు. కమిషనర్‌ సత్యనారాయణ చాంబర్‌ను ముట్టడించి ‘బిల్లులు చేస్తావా..చస్తావా’ అన్న రీతిలో కమిషనర్‌ సత్యనారాయణను బెంబేలెత్తించారు. అలాగే అతని అనుచరులు ఈలలు వేస్తూ, కార్యాలయమంతా కలియదిరుగుతూ ఉద్యోగులను భయాందోళనకు గురి చేశారు.

- 2015 డిసెంబర్‌లో అప్పటి కమిషనర్‌ చల్లా ఓబులేసుపై ప్రకాష్‌నాయుడు రెచ్చిపోయారు. అధికారులపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఎలా అని ఓబులేసు అప్పట్లో ప్రశ్నించగా.. ‘ ఏం..మా ప్రభుత్వంలో మా పనులే చేయరా..?’ అంటూ శివాలెత్తారు. అక్కడే ఉన్న రికార్డులను కూడా చించేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కమిషనర్‌ చెప్పడంతో కాస్త వెనక్కుతగ్గారు.  
- గతేడాది ఏప్రిల్‌లో టీపీఎస్‌గా  ఉన్న రఘురాంపై ప్రకాష్‌నాయుడు నోరుపారేసుకున్నారు. ‘చంద్రప్రియ అపార్ట్‌మెంట్‌ వారితో డబ్బులు వసూలు చేయడానికి వెళ్లావంట. వాళ్లు మా వాళ్లని నీకు తెలియదా?ఉద్యోగం చేయాలని లేదా? తలతిరుగుతోందా?’ అంటూ నోటికొచ్చినట్లు తిట్టాడు. అంతటితో ఆగకుండా అధికారులు లంచం తీసుకుంటున్నారంటూ  నగరపాలక సంస్థ కమిషనర్‌ చాంబర్‌ ముందు నానా బీభత్సం సృష్టించాడు. ఇతని తీరుతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు  సెలవులో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే.. టీపీఎస్‌ రఘురాంకు ప్రకాష్‌ నాయుడు క్షమాపణ చెప్పడంతో వివాదం సమసిపోయింది. ఈఈ సురేంద్రబాబుపైనా ఓ సారి విరుచుకుపడ్డాడు. తమ పనులకు అభ్యంతరం తెలుపుతున్నారంటూ నానా హంగామా చేశాడు.
- గతేడాది జూన్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభకు ముందు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ, ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంలో వారిపై  ‘చంద్రదండు’  కార్యకర్తలు దాడి చేశారు. ఓ కార్యకర్తను తీవ్రంగా గాయపరిచారు.

అడ్డుకట్టేదీ?
 ‘చంద్రదండు’ నగరంలో అలజడి సృష్టిస్తున్నా టీడీపీ జిల్లా నాయకత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. బడా నాయకులే వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటే ఇటువంటి వారికి అడ్డుకట్ట ఎవరు వేస్తారో అర్థం కావడం లేదని అధికారులు, ప్రజలు నిట్టూరుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement