వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణపై సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజులు క్రితం సాక్షిలో ప్రచురితమైన ‘వెంకటగిరిలో దాదాగిరి’ కథనం కాపీలతో ఇక్కడ పరిస్థితిని వివరిస్తూ కాంట్రాక్టర్లు సీఎంకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే వ్యవహర తీరును మార్చకపోతే వెంకటగిరి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనికి కూడా టెండర్లు వేయడం తమవల్ల కాదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు, గవర్నర్ నరసింహానికి వారు ఫిర్యాదు చేశారు. దీంతో మూడు రోజుల క్రితం చంద్రబాబు రామకృష్ణను విజయవాడకు పిలిపించి మాట్లాడారు. కాంట్రాక్టర్లను బెదిరించడం, అధికారులను తిట్టడం లాంటి చర్యలతో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక మీదట పరిస్థితి ఇలాగే కొనసాగితే అధికారులు ఎవరూ నీ మాట వినకుండా చేస్తానని హెచ్చరించారని సమాచారం. సాక్షి పత్రికలో తన మీద అవాస్తవ కథనాలు రాశారని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారని తెలిసింది. సాక్షిలో వచ్చిన కథనాలపై విచారణ జరిపించాలని, అందులో వాస్తవాలు ఉండబట్టే విజయవాడకు పిలిపించామని సీఎం మండిపడ్డారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.