భక్తితో పూజిస్తే అనుగ్రహం సొంతం | Sakshi
Sakshi News home page

భక్తితో పూజిస్తే అనుగ్రహం సొంతం

Published Sun, Nov 20 2016 11:22 PM

భక్తితో పూజిస్తే అనుగ్రహం సొంతం

సాక్షి, విజయవాడ: సకల చరాచర జీవరాశుల్లోనూ భక్తి ఉంటుందని, భక్తిలో పరిణతి చెంది దేవుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని ప్రవచన బ్రహ్మ చాగంటి కోటేశ్వరరావు ఉద్బోధించారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆదివారం కోటి దీపోత్సవం జరిగింది. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు ‘భక్తి– పరిణితి’ అంశంపై మాట్లాడారు. శ్రీకాళహస్తి శివునికి సాలెపురుగు, పాము, ఏనుగు పరిపూర్ణమైన భక్తితో అర్పించుకునేందుకు కూడా సిద్ధమడం వల్లనే వాటికి భగవంతుడు మోక్షాన్ని ప్రసాదించాడని పేర్కొన్నారు. మనస్సు పెట్టకుండా చేసే పూజ కేవలం తంతు మాత్రమేనని అన్నారు. భగవంతుడికి  ప్రేమతో, భక్తితో ఉపచారం చేయాలన్నారు. పరిణితి చెందిన భక్తితో పూజ చేస్తే ఏదో ఒక ఉపచారం వద్ద మనస్సు నిలిచిపోతుందని అక్కడితో పూజ పూర్తయినట్లేనని చెప్పారు.

ఈ దేహం భగవంతునిదే...
కృష్ణుడు గోవర్ధన గిరిని పూజ చేయమని చెప్పడంతో ఇంద్రుడు ఆగ్రహించి రాళ్ల వర్షం కురిపించాడని దీంతో గోపాలురు, గోపికలు కృష్ణుడిని వేడుకోగానే ఏడురాత్రులు, ఏడు పగళ్లు గోవర్ధనగిరి తన చిటికిన వేలుతో ఎత్తిపట్టుకున్నాడని వివరించారు. మన శరీరం భగవంతుడు ఇచ్చిందేనని, ఆయనను కొలిచేందుకే దీన్ని వినియోగించాలని అన్నారు.

ఘనంగా స్వామివార్ల కల్యాణాలు
 చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలకు ముందుగా వేదికపై దుర్గామల్లేశ్వరస్వామి, వేంకటేశ్వరస్వామి వార్ల కల్యాణాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. పలువురు మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మేయర్‌ కోనేరు శ్రీధర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ, ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement