చిల్లరివ్వండి మహాప్రభో.. | cash problems in anantapur city | Sakshi
Sakshi News home page

చిల్లరివ్వండి మహాప్రభో..

Nov 22 2016 11:31 PM | Updated on Jun 1 2018 8:39 PM

చిల్లరివ్వండి మహాప్రభో.. - Sakshi

చిల్లరివ్వండి మహాప్రభో..

కరెన్సీ కష్టాలు కొనసాగుతుండడంతో జనం తల్లడిల్లుతున్నారు. కొద్దిపాటి నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.

- బ్యాంకర్లను ప్రాధేయపడుతున్న జనం
– నగదు కొరత కారణంగా రూ.4 వేలు కూడా ఇవ్వలేకపోతున్న బ్యాంకర్లు
– బ్యాంకులు, ఏటీఎంల వద్ద కొనసాగుతున్న రద్దీ


అనంతపురం అగ్రికల్చర్‌/టౌన్‌ : కరెన్సీ కష్టాలు కొనసాగుతుండడంతో జనం తల్లడిల్లుతున్నారు. కొద్దిపాటి నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. చాలా అవసరముంది సార్‌.. కనీసం రూ.4 వేలైనా ఇవ్వండంటూ బ్యాంకర్లను వేడుకుంటున్నారు. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి 15 రోజులు కావస్తున్నా జనం ఇక్కట్లు ఏ మాత్రమూ తగ్గలేదు. పైగా రోజురోజుకూ జఠిలమవుతున్నాయి.  మంగళవారం కూడా జిల్లా అంతటా అన్ని బ్యాంకుల వద్ద రద్దీ కొనసాగింది. నగదు కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో కొన్ని చోట్ల బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా 36 ప్రిన్సిపల్‌ బ్యాంకులు ఉన్నాయి. వాటి పరిధిలో 456 బ్యాంకు శాఖలు నడుస్తున్నాయి. 70 -80 శాఖల్లో మాత్రమే రూ.2 వేల చొప్పున నగదు మార్పిడి జరుగుతోంది. అది కూడా ఆయా శాఖల పరిధిలోని ఖాతాదారులకు మాత్రమే ఇస్తున్నారు. ఒకేసారి రూ.24 వేల విత్‌డ్రా ఎక్కడా జరగడం లేదు. చాలాచోట్ల కనీసం రూ.4 వేలు కూడా ఇవ్వలేకపోతున్నారు. అందుబాటులో ఉన్న నగదులోనే కొద్దికొద్దిగా సర్దుబాటు చేస్తున్నారు. అనంతపురంలోని ఎస్‌బీఐ సాయినగర్‌ ప్రధానశాఖలో రద్దీ ఏమాత్రమూ తగ్గడం లేదు. ఏటీఎంల పరిస్థితి కూడా మెరుగుపడలేదు. జిల్లా వ్యాప్తంగా ఎస్‌బీఐ పరిధిలో 150 ఏటీఎంలు ఉండగా, అందులో 35 మాత్రమే పనిచేసినట్లు సమాచారం. మిగతా బ్యాంకుల పరిధిలో 400 వరకు ఉండగా.  70కి మించి పనిచేయలేదు. వాటిలో కూడా  రూ.2 వేల నోట్లు మాత్రమే ఉంచడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.

రూ.100 నోట్లు లేక కొన్ని బ్యాంకులు ఏటీఎం కేంద్రాలను నిరవధికంగా మూసేశాయి. రూ.50, రూ.100 నోట్ల చెలామణి తగ్గుముఖం పట్టడంతో రూ.2 వేల నోట్లకు చిల్లర కొరత తీవ్రంగా వేధిస్తోంది. పాత రూ.500, రూ.1000 నోట్ల డిపాజిట్లకు మాత్రం ఇబ్బంది లేదు. పెళ్లిళ్లు, రైతులకు కొన్ని వెసులుబాట్లను కల్పించినట్లు ఆర్బీఐ చెబుతున్నా.. నగదు సమస్య కారణంగా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. మరోవైపు పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ (పీవోఎస్‌) స్వైప్‌మిషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. నగదు రహిత లావాదేవీలు ఉంటాయని చెబుతున్నా.. అందులో కూడా ప్రజల నెత్తిన భారం పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తమ్మీద మెజార్టీ ప్రజలు ఉదయం నుంచి రాత్రి వరకు డబ్బు కోసం అన్ని పనులు పక్కనపెట్టి బ్యాంకులకే పరిమితం అవుతున్నారు. ముఖ్యంగా వ్యాపారులు, రైతులు, కూలీల పరిస్థితి దయనీయంగా మారింది.

వెలవెలబోయిన రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు
 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ఎప్పుడూ లేనంతగా వెలవెలబోయాయి. పెద్దనోట్ల ప్రభావం ఒకవైపు, మంగళవారం సెంటిమెంట్‌ మరోవైపు రిజిస్ట్రేషన్ల శాఖను కుదిపేశాయి.  అనంతపురం, హిందూపురం జిల్లాల రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలోని 22 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మంగళశారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నామమాత్రంగా సాగింది. అనంతపురం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రతి రోజూ 50 నుంచి 60 రిజిస్ట్రేషన్లు జరిగేవి. మంగళవారం ఏడు మాత్రమే జరిగాయి.  రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనూ ఇదే పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లోనూ వందకు మించి రిజిస్ట్రేషన్లు జరగలేదు.

బ్యాంకు ఎదుట ఖాతాదారుల ధర్నా
అమరాపురం : అమరాపురం సిండికేట్‌ బ్యాంకు ఎదుట  ఖాతాదారులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకే ఇక్కడికి చేరుకున్న తమ్మడేపల్లి, గౌడనకుంట తదితర గ్రామాల రైతులు, మహిళలు  రూ.10వేల వరకు విత్‌ డ్రా చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలంటూ బాంకు అధికారులను కోరారు.  రూ.2వేలు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉందని వారు చెప్పారు. దీంతో వారు బ్యాంకు ఎదుట రోడ్డుపై కూర్చొని మధ్యాహ్నం రెండు గంటల వరకు ధర్నా చేపట్టారు. ఫీల్డ్‌ ఆఫీసర్‌ తరుణ్, అధికారి బాబ్జీ నచ్చజెప్పినా ఖాతాదారులు వినలేదు.  10 రోజుల నుంచి బ్యాంకుకు వచ్చి వెళుతున్నామని, రూ.2వేలు మాత్రమే ఇస్తే అవసరాలు ఎలా తీరతాయని ప్రశ్నించారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులకు సర్దిచెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement