కాపుగల్లు క్వారీలో పేలుళ్లు | Sakshi
Sakshi News home page

కాపుగల్లు క్వారీలో పేలుళ్లు

Published Tue, Aug 30 2016 11:45 PM

blastings in kapugallu mines

– ముగ్గురికి తీవ్రగాయాలు
కోదాడ:  అనుభవం లేని కార్మికులతో రాళ్లను పేల్చేందుకు జిలెటిన్‌ స్టిక్స్‌ను అమర్చగా అవి ప్రమాదవశాత్తు పేలి ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు శివారులో చోటు చేసుకుంది. పేలుళ్ల సంఘటనను పక్కదారి పట్టించేందుకు క్వారీ యజమానులు దానిని ట్రాక్టర్‌ ప్రమాదంగా చిత్రీకరించారు. ఇదే ప్రాథమిక సమాచారాన్ని పత్రికలకు ఇచ్చి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.  మండల పరిధిలోని కాపుగల్లు శివారులో విజయలక్ష్మిస్టోన్‌ క్రషర్‌ ఉంది. దీనికి రాళ్లను సరఫరా చేసేందుకు పక్కనే ఉన్న బండను లీజుకు తీసుకున్నారు. దానిని పేల్చడానికి  నకిరేకల్‌ మండలం గోరెంకలపల్లికి చెందిన ముగ్గురు కార్మికులు ఆదివారం రాత్రి 5 బాంబులను(జిలెటిన్‌స్టిక్స్‌) అమర్చారు. అందులో మూడు పేలాయి. మరో రెండు పేలలేదు. సోమవారం ఉదయం అందులో పేలుడు పనులను చూస్తున్న సంపంగి బాబు,  ఎ.రామకష్ణ, బాలరాజులు  పేలని జిలెటిన్‌ స్టిక్స్‌ను  బయటకు తీస్తుండగా అవి ఒక్కసారిగా పేలాయి. దీంతో వీరు ముగ్గురికి  తీవ్రగాయలయ్యాయి. క్వారీ నిర్వాహకులు, తోటి కార్మికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రభుత్వ  ఆస్పత్రికి, అక్కడి నుంచి మరో ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితులు దూర ప్రాంతానికి చెందిన వారు కావడంతో, వారి తరఫున మాట్లావారు ఎవ్వరూ లేక పోవడంతో క్వారీ నిర్వాహకులు పేలుళ్ల సంఘటనను కప్పిపుచ్చారు. ట్రాక్టర్‌ బోల్తాపడడం వల్ల గాయాలయ్యాయని చెప్పారు. తోటి కార్మికులకు కూడా అలాగే చెప్పాలని చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు  సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత కోదాడ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్‌ తెలిపారు.  
చిన్నప్రమాదమే..
 ప్రమాదవశాత్తు క్వారీలో చిన్న సంఘటన జరిగిందని క్వారీ నిర్వాహకులు పేర్కొన్నారు. కార్మికులకు చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని, కాని వారి క్షేమం కోసం మెరుగైన చికిత్సకు హై దాబాద్‌ తీసుకెళ్లామని, గాయపడిన కార్మికులను ఆదుకుంటామని చెప్పారు. 
 

Advertisement
Advertisement