భగ్గుమన్న విభేదాలు | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న విభేదాలు

Published Wed, Nov 30 2016 11:40 PM

bhaggumanna vebedhalu

-  ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య రచ్చ తారాస్థాయికి
 బద్వేలుఅర్బన్‌ :  
గత కొన్ని నెలలుగా  ఎమ్మెల్యే జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మల మధ్య  ఏర్పడిన  విబేధాలు బుధవారం జనచైతన్య యాత్ర ముగింపు సందర్భంగా మరోసారి బహిర్గతమయ్యాయి. గత నెల 1వ తేదీనుంచి ప్రారంభమైన కార్యక్రమాల్లో  వీరివురు వేర్వేరుగా పాల్గొంటూ వచ్చారు.   ఈ క్రమంలో టీడీపీలోని కొందరు నేతలు విజయమ్మ వ్యవహార శైలి నచ్చడం లేదని జయరాములు పంచన చేరారు.  ఆమె తీరుపై పార్టీ అధిష్ఠానానికి సైతం కొందరు నేతలు  ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ పదవి ఎంపికలో సైతం ఇద్దరు నేతల మధ్య రచ్చ తారాస్థాయికి చేరింది. 

ఈ నేపథ్యంలో  ఎవరికి వారుగా జనచైతన్యయాత్రలు చేసుకుంటూ వచ్చారు.  చివరిరోజైన బుధవారం పట్టణంలోని నాగులచెరువు కట్ట ఆంజనేయస్వామి గుడి నుంచి  మార్కెట్‌యార్డు వరకు  ఎమ్మెల్యే జయరాములు తన అనుచరులతో బైక్‌ర్యాలీ నిర్వహించి అనంతరం బహిరంగ సభ ఏర్పాటుచేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో  బైక్‌ ర్యాలీ వచ్చే దారిలో పైపులైన్‌ మరమ్మతుల పేరుతో రోడ్డును తవ్వారు.  ఎమ్మెల్యే వర్గీయులు బైక్‌ ర్యాలీ వద్దకు వెళ్తుండగా గమనించి సంబంధిత సిబ్బందితో  వాగ్వివాదం చేశారు. ఎక్కడైనా ప్రధాన రహదారిలో మరమ్మతులు రాత్రి వేళలో చేసుకోవాలని ఉదయం 9 గంటలకు  ఎలా  చేస్తారని ప్రశ్నించారు.

మాజీ ఎమ్మెల్యే విజయమ్మ , ఆమె ప్రధాన అనుచురుడైన మున్సిపల్‌ చైర్మన్‌ పార్థసారథి ఆదేశాల మేరకు బైక్‌ ర్యాలీని అడ్డుకోవాలని ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని  ఆరోపించారు.  విషయం తెలుసుకున్న సీఐ రామాంజినాయక్‌ ,రూరల్‌ ఎస్‌ఐ నరసింహారెడ్డి , అట్లూరు ఎస్‌ఐ మహ్మద్‌ రఫి  సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే వర్గీయులను శాంతింపచేయడంతోపాటు రోడ్డుపై తీసిన గుంతను మట్టితో పూడ్పించారు. దీంతో సమస్య సద్దుమణిగింది.

జనంలేక వెలవెలబోయిన సభ: జనచైతన్య యాత్ర ముగింపు సందర్భంగా మార్కెట్‌యార్డు ఆవరణలో బహిరంగసభ నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి   హాజరయ్యారు.  కొంతమంది యువతను సమీకరించి ర్యాలీ నిర్వహించినప్పటికీ  సభలో మాత్రం యువకులు లేకుండా వెనుతిరిగారు.  దీంతో   ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో పాటు జనంలేక సభ వెలవెలబోయింది.

Advertisement
Advertisement