ఉద్యమాలతో వేడెక్కిన గద్వాల


గద్వాల : గద్వాల కేంద్రంగా జోగుళాంబ జిల్లా ప్రకటించాలని చేపట్టిన ఉద్యమాలు వేడెక్కాయి. జేఏసీ చేపట్టిన 72గంటల సకల జనుల బంద్‌ రెండోరోజు కొనసాగింది. శనివారం తెల్లవారుజామున నుంచే జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు బైక్‌లపై తిరుగుతూ బంద్‌ను పాటించారు. గద్వాల జిల్లా కాంక్షిస్తూ విద్యాసంస్థలు, దుకాణదారులు, పెట్రోలు బంకులు, సినిమా థియేటర్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొని పలుచోట్ల ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. 

 

పోలీసులతో వాగ్వాదం 

ఆందోళనకారులు రోడ్లపై టైర్లకు నిప్పంటించి రాకపోకలను స్తంభింపజేశారు. ఈ క్రమంలోనే జేఏసీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులను పోలీసుల పహారాలో డిపో నుంచి బయటకు రప్పించేందుకు విఫలయత్నం చేశారు. దీనికి జేఏసీ నాయకులు అభ్యంతరం చెబుతూ అక్కడే బైఠాయించారు. దీంతో ఆర్టీసీ అధికారులు బస్సులను నడపడానికి సాహసించలేదు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, మధుసూదన్‌బాబు, వీరభద్రప్ప, వెంకట్రాజారెడ్డి, రమేష్‌బాబు, వెంకటేశ్వర్‌రెడ్డి, రాము కామ్లే, ఇస్మాయిల్, మన్యం, విద్యార్థి సంఘాల నాయకులు రాజు, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఆర్టీసీ ప్రాంగణంలో వంటావార్పు 

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఆర్టీసీ ప్రాంగణంలో వంటావార్పు నిర్వహించారు. గద్వాల జిల్లా సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీఎస్‌ కేశవ్, కష్ణకుమార్‌రెడ్డి, అజయ్, మహిమూద్, గోవిందు, సతీష్, కోటేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top