సాహస వీరుడు మృత్యువాత

సాహస వీరుడు మృత్యువాత


కడప: వైఎస్సార్‌ జిల్లా కడప నగరానికి చెందిన సహస వీరుడు మదన్‌మోహన్‌(38) ఉగాండాలో సాహస కృత్యాలు చేస్తూ మృత్యువాత పడ్డారు. అక్టోబర్‌ 27న ఉగాండాలోని ఎన్‌ఆర్‌ఐల పిలుపు మేరకు అక్కడ సాహసకృత్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు మదన్‌మోహన్‌రెడ్డి మరో ఇద్దరు విశ్రాంత ఎయిర్‌ఫోర్సు అధికారులు అక్కడికి వెళ్లారు. అయితే ఈనెల 13వ తేదీకి ఆయన తిరిగి రావాల్సి ఉండగా.. 13వ తేదీనే ఆయన తుదిశ్వాస వదిలారు. శిక్షణ ఇస్తున్న క్రమంలో తలెత్తిన సాంకేతికలోపమో.. లేక పరికరాల్లో నాణ్యత లోపమో తెలియదు కానీ మదన్‌మోహన్‌రెడ్డి ఈనెల 6వ తేదీన ప్రమాదానికి గురయ్యారు. దీంతో అక్కడి అధికారులు హాస్పిటల్‌లో చేర్పించారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయన ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) తుదిశ్వాస వదిలారు. ఈనెల 15 లేదా 16 తేదీల్లో ఆయన భౌతికకాయాన్ని కడపకు తీసుకువచ్చేందుకు ఎయిర్‌ఫోర్సు అధికారులు ఏర్పాట్లు చేశారు.12 ప్రపంచ రికార్డులు ఆయన సొంతం..

మొదటి నుంచి వినూత్న ఆలోచనలు.. సాహసకృత్యాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్న ఈయన ఎయిర్‌మెన్‌గా ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వివిధ రకాల సాహసకృత్యాల్లో పాల్గొనేవాడు. పారాగ్లైడింగ్, పారాసైయిలింగ్, పారామోటార్, పవర్ట్‌హెంట్‌ గ్లెడింగ్, పారాజంపింగ్‌ వంటి అంశాల్లో ఎన్నో ప్రదర్శనలు చేశారు. ఈయేడాది ఫిబ్రవరిలో 'ప్రదక్షిణ' పేరుతో 12 రాష్ట్రాల మీదుగా ఆకాశంలో పారామోటార్‌ గ్లైడింగ్‌ చేస్తూ 10వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించారు. దీంతో పాటు హిమాలయాలతో పాటు వివిధ పర్వతారోహణలో సైతం రికార్డులు సృష్టించారు. 2012లో 20,540 ఫీట్ల ఎత్తువరకు మోటార్‌బైక్‌ను పర్వతారోహణ చేసి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో 2013లో పేరు నమోదు చేసుకున్నారు. హిమాలయ పర్వతాల్లో 926 కిలోమీటర్లను 51 గంటల్లో మోటార్‌బైక్‌ ద్వారా ఎక్కి రికార్డు సృష్టించారు. ప్రపంచ పారామోటార్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో సైతం పతకాలు సాధించిన ఈయన మొత్తం మీద 12 ప్రపంచరికార్డులను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో జూనియర్‌ వారెంట్‌ ఆఫీసర్‌గా ఉద్యోగ విరమణ చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top