ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆకే రవికృష్ణ క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు పకడ్బందీ చర్యలు
Mar 1 2017 12:08 AM | Updated on Aug 14 2018 5:56 PM
– అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలతో ఎస్పీ సమీక్ష
కర్నూలు: ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆకే రవికృష్ణ క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంగళవారం సాయంత్రం అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలతో సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికలపై ముందస్తు చర్యల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోలీసులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినా, అసాంఘిక కార్యకలాపాల అణచివేతలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్ బూత్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని సూచించారు.
ఎవరైనా పోలింగ్‌కు అంతరాయం కలిగించినా, హింసాత్మక సంఘటనలకు పాల్పడినా కఠినంగా వ్యవహరించాలన్నారు. మద్యం, డబ్బు, మరణాయుధాల పంపిణీని అరికట్టేందుకు చెక్‌పోస్టుల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు. శాంతి భద్రతల పరంగా ఎక్కడైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ రవిప్రకాష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, హుసేన్‌పీరా, వెంకటాద్రి, సీఐలు సుబ్రమణ్యం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement