నీటి పారుదల శాఖ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి | ACB attack on irrigation branch of DE house | Sakshi
Sakshi News home page

నీటి పారుదల శాఖ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి

Dec 23 2015 7:18 PM | Updated on Aug 17 2018 12:56 PM

వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో ఉంటున్న నీటి పారుదల శాఖ డీఈ బుక్కె గోపాల్ నాయక్ ఇంటిపై బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

రూ.10 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు

ప్రొద్దుటూరు (వైఎస్సార్ జిల్లా): వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో ఉంటున్న నీటి పారుదల శాఖ డీఈ బుక్కె గోపాల్ నాయక్ ఇంటిపై బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కర్నూలు జిల్లా శ్రీశైలం కుడికాలువ ప్రాజెక్టు పరిధిలోని బనగానపల్లె కార్యాలయంలో డీఈగా పని చేస్తున్న ఈయన చాలా ఏళ్లుగా ప్రొద్దుటూరులో ఉంటున్నారు. ఇతను అక్రమంగా అస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఏసీబీ కడప డీఎస్పీ ఎన్.నాగరాజు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. గోపాల్ నాయక్‌కు హైదరాబాద్‌లో మూడు, ప్రొద్దుటూరులో 10 ఇళ్ల స్థలాలు, ప్రస్తుతం ఉంటున్న ఇంటితోపాటు పెన్నానగర్‌లో మరో రెండు ఇళ్లు ఉన్నాయన్నారు.

గోపవరం, కామనూరు గ్రామాల పరిధిలో 13 ఎకరాల భూమి, కడప పరిధిలోని రామరాజుపల్లె వద్ద 70 సెంట్ల స్థలం ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రొద్దుటూరులోని ఇంటిలో 190 గ్రాములు, ఎస్‌బీఐ లాకర్‌లో 20 తులాల బంగారం ఉందని చెప్పారు. ఒక ఇన్నోవా, మరో షిఫ్ట్ కారుతోపాటు రెండు మోటార్ సైకిళ్లు ఉన్నాయన్నారు. రిజిస్టర్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.3 కోట్లు, మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.10-12 కోట్లు ఉంటుందన్నారు. డీఈ బంధువులు ఉంటున్న సుండుపల్లెలో కూడా తనిఖీలు చేశామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఆయన్ను రిమాండ్‌కు తరలిస్తున్నామని చెప్పారు. దాడుల్లో తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్‌ఆర్ జిల్లాల పరిధిలో పనిచేస్తున్న సీఐలు సుధాకర్‌రెడ్డి, శివకుమార్, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement