'ఆయనంటే పేరు కాదు.. ఒక బ్రాండ్' | ysr birth anniversary celebrations in chicago | Sakshi
Sakshi News home page

'ఆయనంటే పేరు కాదు.. ఒక బ్రాండ్'

Jul 3 2016 1:46 PM | Updated on Jul 7 2018 3:19 PM

'ఆయనంటే పేరు కాదు.. ఒక బ్రాండ్' - Sakshi

'ఆయనంటే పేరు కాదు.. ఒక బ్రాండ్'

ప్రాణాలు ఇవ్వగలిగేంత అభిమానం సంపాదించుకున్న మహానేత వైఎస్ఆర్ అని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎన్నారైలు, అభిమానులు కొనియాడారు. ఆయన లేని లోటు ఎవ్వరూ పూడ్చలేనిదని చెప్పారు.

చికాగో:  ప్రాణాలు ఇవ్వగలిగేంత అభిమానం సంపాదించుకున్న మహానేత వైఎస్ఆర్ అని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎన్నారైలు, అభిమానులు కొనియాడారు. ఆయన లేని లోటు ఎవ్వరూ పూడ్చలేనిదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు చికాగో నగరంలో ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం చికాగోలో ఆటా రజతోత్సవ వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ వేడుకలకు హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎన్నారై పార్టీ నేతలు, అభిమానులు ఒక చోట చేరగా వారందరినీ ఆహ్వానిస్తూ వైఎస్ స్నేహితుడు, ప్రముఖ వైద్యుడు ప్రేమ సాగర్ రెడ్డి, హరి లింగాల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ పేరు ప్రఖ్యాతులను, రాజకీయ క్షేత్రంలో ఆయన వేసిన చెరగని ముద్రను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో దాదాపు 500మంది పాల్గొనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, అనిల్ యాదవ్, గుడివాడ అమర్నాథ్, ప్రకాశ్ రావ్ తో పాటు ఆటాకు చెందిన బోర్డు ట్రస్టీలు హరిలింగాల, రాజేందర్ రెడ్డి జిన్నా, శ్రీధర్ రెడ్డి కోర్సాపాటి, దర్గా నాగి రెడ్డి, ఎన్నారై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రమేశ్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, రమణ్ రెడ్డి ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు హరిలింగాల మాట్లాడుతూ వైఎస్ఆర్ లాంటి నేత ఏపీలో ఎవ్వరూ లేరని అన్నారు. ఆయన చరిష్మా ఉన్న నేత అని, ప్రేమామయుడని కొనియాడారు. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఆయన గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవ్వాల్సిందేనని చెప్పారు. వైఎస్ సాధారణమైన నేతకాదని, ప్రాణాలు ఇవ్వగలిగేంత అభిమానం సంపాధించుకున్న నేత అని మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం పెద్దమొత్తంలో సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ తీసుకొచ్చారని, అవే పథకాలను రానున్న కాలంలో ఆయన తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్తారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

గోనే ప్రకాశ్ రావు మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి లోనయ్యారు. దేశ రాజకీయాలకు సుస్థిరతను అందించిన నేత వైఎస్ఆర్ అన్నారు. యూపీఏ ప్రభుత్వానికి ఒక మూలస్తంభంగా నిలిచారని కొనియాడారు. రోజా కంటతడి పెడుతూ వైఎస్ఆర్ అంటే ఒక పేరు కాదని ఒక బ్రాండ్ అని అన్నారు. ఆయన పాలన ఏపీలో ఒక స్వర్ణయుగం అన్నారు. మళ్లీ అలాంటి రోజులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో వస్తాయని చెప్పారు.

ఒక మానవతా దృక్పథంతో రాజకీయాల ద్వారా ప్రజలకు దగ్గరైన వ్యక్తి మహోన్నత వ్యక్తి వైఎస్ అని అంబటి రాంబాబు అన్నారు. ప్రేమ్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ తనకు ఆప్త మిత్రుడని చెప్పారు. మెడికల్ స్కూల్ నుంచే తమకు విడదీయరాని సంబంధం ఉందని చెప్పారు. ఆయన ఎప్పుడు రైతుల గురించి ఆలోచించేవారని, రైతులకు మంచి జరిగేందుకు సూచనలు చెప్పాలని కోరేవారని తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement