తిరుమల శ్రీవారికి అపచారం
ముక్కోటి ఏకాదశి పూట తిరుమల శ్రీవారికి జరగాల్సిన పూజా కార్యక్రమాలు సరిగా జరగలేదు. వీవీఐపీల సేవలో తరించిన అధికారులు.. స్వామివారికి జరపాల్సిన పూజలను కూడా సరిగా జరిపించలేదు.
ముక్కోటి ఏకాదశి పూట తిరుమల శ్రీవారికి జరగాల్సిన పూజా కార్యక్రమాలు సరిగా జరగలేదు. వీవీఐపీల సేవలో తరించిన అధికారులు.. స్వామివారికి జరపాల్సిన పూజలను కూడా సరిగా జరిపించలేదు. అర్చన సమయంలో శతనామావళిలో 108 నామాలు చదవాల్సి ఉండగా, కేవలం 18 నామాలు మాత్రం చదివి సరిపెట్టేశారు. చివరకు స్వామివారి కైంకర్య సేవకు కూడా టీటీడీ అధికారులు, అర్చకులు తిలోదకాలు ఇచ్చేశారు.
ముక్కోటి దేవతలు వస్తారని చెప్పే వైకుంఠ ఏకాదశి రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవాలయాలన్నీ వైభవోపేతంగా అలంకరణలతో అలరారుతూ, వేంకటేశ్వరునికి అద్భుతంగా పూజా కార్యక్రమాలు చేస్తుంటే.. ఏడుకొండల వాడు కొలువున్న తిరుపతిలో మాత్రం అసలు శతనామావళి కూడా చదవకుండా వదిలేయడం భక్తులకు ఆగ్రహం తెప్పించింది. సామాన్య భక్తులను అరక్షణంలో తోసిపారేసే సిబ్బంది, వీవీఐపీలకు మాత్రం సాష్టాంగపడుతున్నారని ఆరోపిస్తున్నారు.


