షాకింగ్‌ : ఆన్‌లైన్‌లో నకిలీ స్మార్ట్‌ఫోన్ల విక్రయం

Is Your Phone A Fake? Cops In Gujarat Seize Counterfeit Mobiles - Sakshi

ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్లను కొంటున్నారా? అయితే కాస్త చూసి కొనుగోలు చేయండని పలు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. తాజాగా వడోదరలో భారీ ఫేక్‌ మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ రాకెట్‌ వెలుగుచూసింది. ఈ రాకెట్‌లో కీలక సూత్రధారి అయిన ఓ వ్యక్తిని వడోదర పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వ్యక్తి నకిలీ హ్యాండ్‌సెట్‌లను తయారుచేసి, వాటిని ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయిస్తున్నట్టు పోలీసులు కనుగొన్నారు. అంతేకాక ఈ వ్యక్తి నుంచి రూ.24 లక్షల విలువైన నకిలీ మొబైల్‌ హ్యాండ్‌సెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ హ్యాండ్‌సెట్లపై తాము ఇప్పటికే పలు ఫిర్యాదులను అందుకున్నామని, కాపీరైట్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. 

నకిలీ మొబైల్‌ హ్యాండ్‌సెట్ల రాకెట్‌లో కీలకదారి అయిన ఈ వ్యక్తి దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు నకిలీ యూనిట్లను అమ్మినట్టు విచారణలో తేలింది. నకిలీ డివైజ్‌లలో ముఖ్యంగా ఐఫోన్‌ ఎక్స్‌, శాంసంగ్‌ గెలాక్సీ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు ఉన్నట్టు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. రూ.50వేలకు పైన ఖరీదు ఉన్నవాటినే నకిలీలు రూపొందించి, ఆన్‌లైన్‌ కస్టమర్లకు అమ్మినట్టు తేల్చారు.  అయితే కస్టమర్లు తాము కొనుగోలు చేయాలనుకునే స్మార్ట్‌ఫోన్‌ అసలైనదా? కానిదా? తెలుసుకునేందుకు ప్రతి ఫోన్‌పై ఐఎంఈఐ నెంబర్‌ను చెక్‌ చేసుకోవాలని పోలీసులు సూచించారు. *#06# నెంబర్‌కు డయల్‌ చేసినా కూడా ఐఎంఈఐ నెంబర్‌, సంబంధిత మొబైల్‌ కంపెనీదా? కాదా? అని తెలిసిపోతుందన్నారు.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top