
నిజామాబాద్: ఉద్యోగం దొరకడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు మంగళవారం ట్రాన్స్‌ఫార్మర్ పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. జిల్లాలోని నవీపేట్ మండలం బినోలా గ్రామానికి చెందిన గుండాజీ భోజరావు గోల్డ్‌స్మిత్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరిలో చిన్నవాడైన గుండాజీ హరీశ్ (23) బీటెక్‌లో అడ్మిషన్ పొందాడు. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవటంతో చదువు పూర్తి చేయలేకపోయాడు. ఈ క్రమంలో రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్నాడు.
వీరి కుటుంబం మూడు నెలల క్రితం నిజామాబాద్ వర్నిరోడ్డులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. హరీశ్ కుటుంబానికి అండగా ఉండేందుకు ఏదైనా పనిచేయాలని భావించాడు. అందుకోసం పలు కంపెనీలు, దుకాణాల్లో ఉద్యోగ ప్రయత్నం చేశాడు. ఎక్కడా ఉద్యోగం దొరకకపోవటంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఇంటికి భారమైపోయినట్లు కలత చెందాడు. గతంలో ఓసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. సోమవారం రాత్రి హరీశ్ ఎప్పటిలాగే అందరితో కలసి భోజనం చేసి పడుకున్నాడు.
మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంట్లో కనిపించకపోవటంతో వాకింగ్‌కు వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. కానీ, ఇంటికి దగ్గరలోని న్యాల్‌కల్ చౌరస్తాలో పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీహరి తెలిపారు.