బావ పరిహాసం.. మరదలు మనస్తాపం

Young Women Commits Suicide on Train Track - Sakshi

రైలు కిందపడి యువతి ఆత్మహత్య

ముషీరాబాద్‌: బావ పరిహాసం ఆడటంతో మనస్తాపానికిలోనైన ఓ యువతి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం ముషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్‌ జిల్లా, తొర్రూర్‌ మండలం, గుర్తూర్‌ గ్రామానికి చెందిన శిరీషకు వరంగల్‌ రూరల్‌ జిల్లా, వర్ధన్నపేట మండలం, ల్యాబర్తి గ్రామానికి చెందిన వినయ్‌కుమార్‌తో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. శిరీష బీటెక్‌ చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా, వినయ్‌కుమార్‌ చిక్కడపల్లి మోర్‌ సూపర్‌ మార్కెట్‌లో స్టోర్‌ మేనేజర్‌గా పనిచేసేవాడు. ఇద్దరూ గాంధీనగర్‌లోని సాయిరాం అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. వీరి ఇంట్లోనే ఈ నెల 14న వినయ్‌కుమార్‌ మేనకోడలు పెళ్లిచూపుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్‌కుమార్‌ సోదరుడు శిరీషను ఉద్ధేశించి ‘ పెళ్లికాకముందు శిరీష ముఖం నల్లగా ఉండేదని, పెళ్‌లైన తరువాత తెల్లగా అయ్యిందని ఫెయిర్‌ అండ్‌ లవ్లీ వాడుతున్నావా’ అనడంతో అందరూ నవ్వారు. దీంతో ఆమె మనస్తాపానికిలోనైంది. ఇదే విషయంపై భర్తతో గొడవపడిన శిరీష మధ్యాహ్నం పుట్టింటికి వెళుతున్నట్లు   చెప్పి బయటికి వెళ్లింది.

వినయ్‌ ఆమెను వారించేందుకు గోల్కొండ క్రాస్‌రోడ్స్‌ వరకు వెళ్లి బతిమాలినా వినకపోవడంతో వెనక్కు తిరిగి వచ్చాడు. అనంతరం శిరీష పుట్టింటికి వెళ్లకుండా తెలిసినవారి వద్ద రూ.100 తీసుకొని సికింద్రాబాద్‌ వెళ్లి అక్కడి నుంచి వరంగల్‌ వెళ్లే రైలు ఎక్కింది. ఘట్‌కేసర్, బీబీనగర్‌ స్టేషన్ల మధ్య ఔషాపూర్‌ గ్రామ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది.  స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచారు. అయితే శిరీష పుట్టింటికి చేరుకోలేదని తెలియడంతో ఆమె భర్త వినయ్‌ ఈ నెల 15న ముషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణలో భాగంగా మిస్సింగ్‌పై అన్ని పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు గుర్తుతెలియని యువతి మృతదేహం విషయమై సమాచారం అందించడంతో ముషీరాబాద్‌ పోలీసులు గాంధీ ఆస్పత్రి మార్చురీలో భౌతికకాయాన్ని   పరిశీలించారు. అనంతరం బంధువులకు సమచారం అందించడంతో వారు మృతురాలు శిరీషగా గుర్తించారు.   కాగా అదనపు కట్నం కోసం వినయ్‌ కుటుంబసభ్యులు తమ కుమార్తెను వేధిస్తున్నారని, అందులో భాగంగానే తక్కువ చేసి మాట్లాడటంతో మనస్తాపానికిలోనై శిరీష ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి లక్ష్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top