అనుమానాస్పదంగా యువకుడి మృతి

Young man Suspicion death - Sakshi

కొన్నాళ్లుగా ఓ వివాహితతో అనైతిక సంబంధం

ఆమె ఇంట్లోనే కిటికీకి చీరతో ఉరి వేసుకున్న స్థితిలో మృతదేహం

ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తూ బంధువుల ఫిర్యాదు

పోలీసుల అదుపులో వివాహిత, మరో యువకుడు

విశాఖపట్నం, పెందుర్తి: పెందుర్తి సమీపంలోని చినముషిడివాడ సిద్దార్థనగర్‌ కాలనీలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఓ వివాహితతో యువకుడు అక్రమ సంబందం కలిగి ఉన్న ఇంట్లోనే ఘటన చోటుచేసుకుంది. సదరు వివాహిత, మరో యువకుడు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. గురువారం ఉదయం స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సింహాచలం సమీపంలోని గోశాల ప్రాంతానికి చెందిన బలిరెడ్డి తరుణ్‌కుమార్‌(25) తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. తరుణ్‌కి చినముషిడివాడకు చెందిన వివాహిత దొడ్డి కుమారి(భర్తతో కలిసి ఉండడం లేదు)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కాగా ఉపాధి నిమిత్తం కొన్నాళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లిన తరుణ్‌ కొద్దిరోజుల క్రితమే ఇంటికి వచ్చాడు.

ఈ క్రమంలో సిద్దార్థనగర్‌లో ఉంటున్న కుమారి వద్దకు రాత్రి సమయంలో వచ్చేవాడు. బుధవారం రాత్రి కూడా వచ్చిన తరుణ్‌ గురువారం తెల్లవారుజామున కిటికీకి చీరతో ఉరి వేసుకుని కనిపించాడు. ఈ నేపథ్యంలో కుమారి చుట్టుపక్కల వారిని పిలవగా వారు తరుణ్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటానాస్థలికి చేరుకున్న మృతుని బంధువులు కుమారి, ఆమెతో చనువుగా ఉండే షణ్ముఖ అనే యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అంతా అనుమానమే
ఘటనాస్థలంలో మృతుడు తరుణ్‌ ఉరి వేసుకున్న విదానమే అనుమానాస్పదంగా ఉంది. కాళ్లు కిందకు తగిలేలా ఉండే కిటికీకి ఉరి ఎలా వేసుకుంటాడని మృతుని బంధువులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఉరి వేసుకుంటే సాధారణంగా నాలుక బయటకు వస్తుంది. కానీ తరుణ్‌ మృతదేహం అలా లేదు. మరోవైపు తరుణ్‌ సంబంధం కొనసాగిస్తున్న కుమారిపై గతంలో వ్యభిచారం ఆరోపణలు ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో ఆమె మరో యువకుడితో చనువుగా ఉన్నట్లు తరుణ్‌ గమనించినట్లు తెలుస్తుంది. కాగా మృతుని బంధువులు కూడా కుమారి సహా షణ్ముఖ అనే యువకుడే తరుణ్‌ని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపిస్తున్నారు. పోలీసులు కుమారి, షణ్ముఖలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తరుణ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత కేసు ఓ కొలిక్కి వస్తుందని పెందుర్తి సీఐ పి.సూర్యనారాయణ చెప్పారు. సీఐ ఆధ్వర్యంలో ఎస్‌ఐ అప్పలరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top